Paris Olympics: ఫ్రాన్స్‌లో దుండగుల దుశ్చర్య
పారిస్: ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సబ్స్టేషన్లపై దాడి చేశారు. కేబుళ్లు తెంపేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌తోపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి పారిస్‌కు రైల్వే సేవలు నిలిపివేయాల్సి వచి్చంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో పారిస్‌కు తరలించారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వామపక్షవాద మిలిటెంట్లు లేదా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నదే వారి ఎత్తుగడ కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఒలింపిక్ క్రీడలతో ఈ దాడులకు ప్రత్యక్ష సంబంధం లేదని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలను అడ్డుకోవాలన్నది దుండగుల ఆలోచన కాకపోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను స్తంభింపజేసిన దుండుగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు. తాజా ఘటనలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అటాల్ స్పందించారు. ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడులేని చెప్పారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి పారిస్‌కు దారితీసే రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పారిస్‌కు వెళ్లే రైళ్లను అడ్డుకోవాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దుండగుల కోసం గాలింపు ప్రారంభమైందన్నారు. మధ్యాహ్నం తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగాయని రవాణా మంత్రి పాట్రిస్ వెర్‌గ్రిటే చెప్పారు. ఒలింపిక్స్ సందర్భంగా ముష్కరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు నెల రోజుల క్రితమే హెచ్చరించాయి.