నిరాశే మిగిలింది
చెన్నై, సాక్షి ప్రతినిధి: గత 2015-16 రైల్వేబడ్జెట్‌లో తమిళనాడుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కొత్త రైలు మార్గాలకు రూ.23 కోట్లు, బ్రాడ్‌గేజ్ పనులకు రూ.344 కోట్లు, జంటరైలు మార్గాలకు రూ.672 కోట్లు తదితర పనులకు మొత్తం రూ.2,434 కోట్లు కేటాయించి కొత్త పథకాలు అమలుచేస్తామని పేర్కొన్నారు. అయితే గత రైల్వేబడ్జెట్‌లో ప్రస్తావించిన కేటాయింపులు జరగలేదు. గత బడ్జెట్లో కొత్త రైళ్లకు, కొత్త రైలు మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం ఈ ఏడాదైనా ప్రాధాన్యతలు గుర్తిస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.
నిధుల కేటాయింపులు జరగాల్సిన పనులు:
మధురై- కన్యాకుమారీ జంట రైలు మార్గానికి 2015-16 బడ్జెట్లో రూ.2వేల కోట్లు అంచనావేసి కేవలం రూ.77 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. తాజా బడ్జెట్లో సైతం ఈ పనులకు సంబంధించి మిగులు మొత్తానికి కేటాయింపులు చూపలేదు. చెంగోట్టై-పునలూరు బ్రాడ్‌గేజ్ పనులకు రూ.100 కోట్లు కేటాయించాల్సి ఉండగా, మొండిచేయి మిగిలింది. దక్షిణ ప్రాంతానికి చెందిన ప్రజలు శబరిమలై ప్రయాణానికి వీలుగా రైలు మార్గం పథకం సిద్ధమై ఉంది. దిండుగల్లు- పెరియకుళం-తేనీ- పోడీ-కుములి మీదుగా 120 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1000 కోట్లు అవసరం.
దక్షిణ రైల్వే ద్వారా నాలుగుసార్లు సర్వే చేసి నివేదికను సైతం రైల్వే అధారిటీకి పంపారు. అయితే ఈ బడ్జెట్లో శబరిమలై పథకం ఊసే లేదు. తిరునెల్వేలీ జిల్లా నంగునేరిలో రైల్వే ఇంజన్ల కర్మాగారం ఏర్పాటు గురించి ప్రకటిస్తారని ఆశించి భంగ పడ్డారు. కన్యాకుమారీ, నాగరకోవిల్ రైల్వేస్టేషన్ల నుండి అధిక సంఖ్యలో రైళ్లు బయలుదేరేలా ఆధునీకరించేందుకు వీలుగా నిధుల కేటాయింపు జరుగుతుందని ఆశించారు. మదురై-పోడి బ్రాడ్‌గేజ్ పనుల పథకం ప్రకటించినా పనుల ప్రారంభానికి అవసరమైన అనుమతులు ఇవ్వలేదు.
తమిళనాడుకు వరాలివే: తాజా రైల్వేబడ్జెట్‌లో తమిళనాడుకు నామమాత్ర ప్రాధాన్యత క ల్పించారు. దేశంలోనే తొలి ఆటోహబ్ చెన్నైకి మంజూరు చేశారు. ఈ హబ్ ద్వారా బోగీలు, ఇంజన్ల ఉత్పత్తితోపాటు విదేశాలకు ఎగుమతులు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. చెన్నైలోని సాధారణ స్టేషన్లను, లోకల్ రైల్వేస్టేషన్ల ఏర్పాటు, అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్రప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. నాగపట్నం, వేలాంగణి రైల్వేస్టేషన్లకు సొబగులు అద్దండంతోపాటు పండుగ రోజుల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు బడ్జెట్లో అనుమతి లభించింది. చెన్నై-డిల్లీ తదితర మూడు గూడ్సురైళ్ల రాకపోకలకు వీలుగా ప్రత్యేకంగా పట్టాలను అమర్చనున్నారు. రాష్ట్రప్రభుత్వంతో కలిసి ఫ్లైవోవర్ బ్రిడ్జీలను నిర్మించనున్నారు.
ఎంఓయూలను పునస్సమీక్షించాలి:
జయలలిత
రైల్వేపరమైన అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్రాలను భాగస్వామ్యులను చేస్తూ రైల్వేబడ్జెట్‌లో పేర్కొన్న మెమొరాండమ్ ఆఫ్ ఆండర్స్టాండింగ్ (ఎంఓయూ)ను పునస్సమీక్షించాలని తమ ప్రభుత్వం తరపున కోరుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. రైల్వేబడ్జెట్ లో తమిళనాడుకు అన్యాయం జరిగిందని ఘాటుగా స్పందించారు. రైల్వే అభివృద్ధి పనుల్లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని భూసేకరణకే సరిపోతుందని, మిగిలిన 25 శాతం రైల్వేవారు కేటాయిస్తూ మొత్తం పెత్తనం వహించడం సరికాదని అన్నారు.
కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రాలతో ముడిపెట్టడం, నామమాత్ర చర్చలనే ఎంఓయూగా పరిగణించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెన్నై- తూత్తుకూడి ఫ్రైట్ కారిడార్, చెన్నై-మదురై-కన్యాకుమారీ హైస్పీడ్ ప్యాసింజర్ రైలు, కోయంబత్తూరు-మదురై హైస్పీడ్ ప్యాసింజర్ రైలు 2023 విజన్ డాక్యుమెంటులో తాము పెట్టిన సంగతిని గుర్తుచేస్తూ ఈనెల 11వ తేదీన రైల్వేమంత్రికి తాను రాసిన లేఖలో పేర్కొన్న అంశాలలో ఒక్క అంశానికి మాత్రమే మోక్షం లభించిందని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త రైళ్లు, కొత్త రైలు మార్గాలను కేటాయించలేదని విమర్శించారు. మొత్తం మీద ఈ రైల్వే బడ్జెట్ తీవ్రస్థాయిలో నిరాశపరించిందని ఆమె ఆక్షేపించారు.
జయ హర్షం: అయితే తాజా రైల్వేబడ్జెట్‌లో లగేజీకి ప్రాముఖ్యత నివ్వడం సంతోషకరమని అన్నారు. చెన్నై-ఢిల్లీ ఫ్ల్రైట్ కారిడార్‌ను సైతం స్వాగతిస్తున్నానని చెప్పారు. అలాగే ఆటోమొబైల్ హబ్‌ను నెలకొల్పడం ద్వారా చెన్నైకి అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తరించినట్లయిందని హర్షం వెలిబుచ్చారు. మహిళా ప్రయాణికులకు రక్షణ, సీట్ల కోటాలో రిజర్వేషన్, ప్రత్యేక ప్రతిభావంతుల, సాధారణ ప్రయాణికుల వసతి పెంపు తదితర అంశాలను ప్రశంసనీయమన్నారు. నాగపట్నం, వేలాక్కణి పుణ్యక్షేత్రాల రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించడం మెచ్చదగిన అంశమని అన్నారు. సాధారణ ప్రయాణికుడిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించిన రైల్వే మంత్రిని జయ అభినందించారు.