విరార్‌లో ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కార్ షెడ్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే కార్ షెడ్‌ను పశ్చిమ రైల్వే పరిధిలోని విరార్‌లో నిర్మిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో సుమారు 25.87 హెక్టార్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ షెడ్లో ఒకేసారి 16 లోకల్ రైళ్లను నిలిపేందుకు వీలు కలుగనుంది. దీంతోపాటు మూడు 15 బోగీల లోకల్ రైళ్ల మరమ్మతులను ఈ షెడ్లో చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్ షెడ్ నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని ‘ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్’ (ఎంఆర్వీసీ) పేర్కొంది. మిగిలిన పనులు 2014 ఆరంభం నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు.
నిర్మాణ పనులు పూర్తికాగానే పశ్చిమ రైల్వేకి ఈ షెడ్‌ను అప్పగించనున్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. మరమ్మతులు, నిర్వహణ కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు షెడ్లను అధికంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పశ్చిమ రైల్వేమార్గంలో ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో అతిపెద్ద కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే ముంబైలో స్థలాభావం వల్ల కార్ షెడ్‌ను విరార్‌లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగానూ విరార్-నాలాసోపారా రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 25.87 హెక్టార్లు అనగా సుమారు 62 ఎకరాల స్థలాన్ని 2004లో ఎంపిక చేశారు. 2005లో ఈ స్థలాన్ని రూ. 31 కోట్లతో కొనుగోలు చేశారు.
ఇదే స్థలంలో రూ. 300 కోట్ల వ్యయంతో ఎంఆర్పీసీ 2006 ఈ అత్యాధునికమైన అతిపెద్ద కార్‌షెడ్ నిర్మాణం పనులు చేపట్టింది. సమీపంలోని ఓ దిగుడు బావిని ఈ మరమ్మతు షెడ్‌కు నీటి సరఫరా కోసం కేటాయించారు. ఇక్కడ ఉపయోగించిన నీటిని పునర్వినియోగించడానికి సమీపంలోనే ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. ప్రస్తుతం భూమిలోపల తొమ్మిది లక్షల లీటర్ల నీటిని నిలువ చేసేందుకు వీలుగా ట్యాంక్‌ను నిర్మించారు. ఈ షెడ్లో లోకల్ రైళ్లను అత్యాధునిక అటోమెటిక్ యంత్రాలతో వాషింగ్ చేసేందుకు వీలుంది. సమీపంలో పనిచేసే సిబ్బంది విశ్రాంతి కోసం 53 గదులను నిర్మించడంతోపాటు మోటర్‌మెన్, గార్డుల విశ్రాంతి కోసం 28 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమవుతున్న ఈ కార్‌షెడ్ ఆసియాలో అతిపెద్ద కార్ షెడ్‌గా గుర్తింపు పొందనుందని ఎంఆర్వీసీ పేర్కొంటోంది.