Railway exam
-
రైల్వే దరఖాస్తు ఫీజును పెంచలేదు: పియూష్
న్యూఢిల్లీ: రైల్వేల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజును పెంచలేదని ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. గతంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ తదితర కొన్ని వర్గాల అభ్యర్థులను ఉచితంగా పరీక్షలకు అనుమతించేవారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల నుంచి రూ.100 వసూలు చేసేవారు. అయితే ఫీజు లేకపోవడంతో చాలా మంది కేవలం దరఖాస్తు చేసి కనీసం పరీక్షకు కూడా హాజరు కావడం లేదని తాము గుర్తించామనీ, కాలక్షేపం కోసం కాకుండా నిజంగా ఉద్యోగం కోరుకునేవారే దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకున్నామని గోయల్ చెప్పారు. అందులో భాగంగానే గతంలో ఫీజు మినహాయింపు ఉన్న వర్గాల అభ్యర్థుల నుంచి ఈసారి రూ.250, జనరల్ అభ్యర్థుల నుంచి రూ.500 ఫీజు తొలుత వసూలు చేయాలని తాము నిర్ణయించామన్నారు. పరీక్షకు హాజరైన వారిలోని మినహాయింపు ఉన్న వర్గాలకు వారు కట్టిన మొత్తం ఫీజును, జనరల్ అభ్యర్థులకు రూ.400ను వెనక్కు ఇస్తామన్నారు. అందువల్ల ఇది ఫీజు పెంపు కిందకు రాదని గోయల్ వివరించారు. -
96 శాతం మార్కులు.. మోదీజీ ప్లీజ్ హెల్ప్ మి..
న్యూఢిల్లీ : తనకు జరిగిన అన్యాయంపై జోక్యం చేసుకోవాలని ఓ నిరుద్యోగి ప్రధాని నరేంద్రమోదీని సాయం కోసం వేచిచూస్తున్నాడు. లలిత్ కుమార్ అనే వ్యక్తి 2013 డిసెంబర్లో నిర్వహించిన నార్త్ రైల్వే గ్రూప్-డి పరీక్షకు హాజరయ్యాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఈ విషయంపై ఆర్టీఐని ఆశ్రయించి తనకి 96 శాతం మార్కులు వచ్చినట్లు సమాచారం తెలుసుకున్నాడు. లలిత్ కుమార్ అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ఆర్ఆర్సీ అధికారులు వెల్లడించినట్లు న్యూఢిల్లీలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేర్కొన్నారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించినప్పటికీ తప్పుడు మార్గంలో మార్కులు తెచ్చుకున్నట్లు భావించిన కారణంగా అధికారులు అతడిని సెలెక్ట్ చేయలేదట. ఈ సమాచారంపై సంతృప్తిచెందని లలిత్ ఫస్ట్ అప్పలేట్ ఆధికారుకు గత ఆగస్టులో అప్పీలు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను మోసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనకు ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. తాను ప్రస్తుతం సోషల్ వర్క్‌లో డిగ్రీ చేస్తూ, ఢిల్లీ రవాణాశాఖలో పనిచేస్తున్నట్లు చెప్పి వాపోయాడు. పేద కుటుంబం నుంచి వచ్చానని, ఈ ఉద్యోగం అనేది తనకే కాదు కుటుంబానికి ఎంతో ముఖ్యమన్నాడు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తానన్నాడు.