రహదారులకు మహర్దశ
నిజామాబాద్ సిటీ: జిల్లాలోని ప్రధాన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇందుకోసం ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భారీ ప్రతిపాదనలను చేర్చారు. కొత్త రోడ్లను నిర్మించటంతో పాటు, ఉన్న రోడ్ల ను అభివృద్ధి చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రానున్న ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా రూ.770.20 కో ట్ల పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిం చారు.
నిజామాబాద్ డివిజన్లో రూ. 508.70 కోట్లు, జిల్లా కేంద్రంలో రూ. 8 కోట్లు, బోధన్ డివిజన్లో 253.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పటి వరకు అసలే లేని చోట రోడ్లను నిర్మించి, ఒక గ్రామంతో మరొక గ్రావూనికి అనుసంధానం చేయనున్నారు. దీంతో దూరం తగ్గటమే కాకుండా, ప్రయాణ వ్యయం తగ్గుతుంది. నిజామాబాద్-నర్సి మార్గంలో ఆరు మైనర్ బ్రిడ్జిలను ప్రతిపాదనలో చేర్చారు. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు.
మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి
నిజామాబాద్, డిచ్పల్లి రహదారిలోని మాధవనగర్ రైల్వేగేట్ వద్ద నిత్యం విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ మధ్య గతంలో మాధవనగర్, డిచ్పల్లి, కామారెడ్డి, గుండ్ల పోచంపల్లి మొత్తం నాలుగు ప్రాంతాలలో రైల్వే గేట్లు ఉండేవి. హైదరాబాద్ నుంచి డిచ్పల్లి వరకు రోడ్డును విస్తరించటంతో గుండ్ల పోచంపల్లి, కామారెడ్డి, డిచ్పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో ప్రయాణికులకు చాలావరకు ప్రయాణ సమయం ఆదా అయ్యింది. ఇక మాధవ్‌నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కలగానే మిగిలిపోయిం ది. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో ఇక్కడ రైల్వేఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 80కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రజలకు రైల్వేగేట్‌తో ఇబ్బందులు తప్పనున్నాయి.
నగరంలో
నగరంలో రైల్వేకమాన్ వద్ద ప్రస్తుతం ఒకటే మార్గం ఉంది. దీని పక్కన మరొకటి నిర్మించేందుకు రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. అర్సపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రూ. 40 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. వాస్తవానికి బైపాస్‌రోడ్డు నిర్మాణం మొదలు పెట్టగానే ఈ బ్రిడ్జి పనులు మొదలు పెట్టవలసి ఉండగా, నేటికీ శంకుస్థాపన జరుగలేదు. ఇప్పుడు మన ఊరు ప్రణాళికలో దీనిని చేర్చారు.