దశాబ్దాల నిర్లక్ష్యం
సాక్షి,యాదాద్రి: ఇదీ దశాబ్దాల నిర్లక్ష్యం, స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు గడిచి ప్రభుత్వాలెన్ని మారుతున్నా ఇక్కడి ప్రజల అవసరాలను కేంద్రం తీర్చడం లేదు. నిజాం కాలంనాటి రైల్వే లైన్‌తో భువనగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వసతి క్రమంగా పెరగడం లేదు. కాంగ్రెస్, కాంగ్రెసేతర, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైల్వే సమస్యలను ఇక్కడి ప్రజలు గొంతెత్తి నినదిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తీవ్ర కరువు పీడిత ప్రాంతమైన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో రైల్వే సమస్యలు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే లైన్లు, నూతన రైళ్లు, ప్రయాణికుల వసతులు పెంచడంలో రైల్వే శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాలతో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం జరగడంలేదు. ప్రజల జీవన విధానంలో పెనవేసుకుపోయిన రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని చూసిన ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడే రైల్వేను విస్మరించడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ప్రాంత అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా రైల్వేలు దోహదపడుతాయి అలాంటి రేల్వేలు సమస్యలకు నిలయంగా మారాయి. యాదాద్రి వరకు మంజూరైన ఎంఎంటీఎస్ పొడిగింపు పనులు ముందుకు సాగడం లేదు, ఘట్కేసర్ వరకు రెండో దశ పనులు పూర్తి కాలేదు. బీబీనగర్ నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం లభించలేదు. హైద్రాబాద్– సూర్యాపేట– అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే రైలు మార్గం ప్రతిపాదనలు అటకెక్కాయి.
ఎంఎంటీఎస్ ఎప్పుడు ?
యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లైన్ పొడిగింపునకు అరకొర నిధులు కేటాయించారు. మల్టీ మోడల్‌ట్రాన్స్‌పోర్టు సిస్టం( ఎంఎంటీఎస్) రైలు వస్తుందని భావించిన వారికి మరికొంత కాలం నిరీక్షించకతప్పని పరిస్థితి నెలకొంది. రాయిగిరి వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను జనగామ వరకు పొడిగించాలన్న డిమాండ్ అక్కడి ప్రజల నుంచి ఉంది. రాయిగిరి వరకు ఎంఎటీఎస్కు కేంద్రం నిధులు మంజూరు చేయలేదు. అలాగే సికిం ద్రాబాద్ –కాజీపేట మార్గంలో మూడో లైన్ ఊసే లేకుండా పోయిం ది.
ఈ ప్రాజెక్టు కోసం 15 సంవత్సరాలుగా ఎదురుచూపులు తప్పడంలేదు. గతంలో సర్వే చేసిన అధికారులు ఇప్పుడు దాన్ని మరిచిపోయారు. ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం ఇలా పలు కారణాలతో జంట నగరాలకు నిత్యం భువగగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధినుంచి వేలాది మంది రైళ్లలో ప్ర యాణం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ వచ్చినా, మూడోలైన్ ఏర్పాటు జరి గి రైళ్ల హాల్టింగ్ లు పెరిగితే ఈ ప్రాంత ప్రజలకు మరింత ఉపా«ధి అవకాశాలు మెరుగుపడతాయి.
సూర్యాపేట రైలు మార్గం ఎక్కడ?
హైదరాబాద్– అమరావతి ఎక్స్‌ప్రెస్ రైల్వే కోసం జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. జాతీయరహదారి 65కు అనుబంధంగా అమరావతి వరకు నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్, వనస్థలిపురం, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట మీదుగా అమరావతి వరకు ఎక్స్‌ప్రెస్ రైల్వేలైన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ కేంద్రం ఇంతవరకు ఆ ప్రాజెక్టుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
బీబీనగర్– నడికుడి డబ్లింగ్‌కు నిధులేవీ?
బీబీనగర్– నడికుడి (252 కిలో మీటర్లు) డబ్లింగ్ పనులకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఈ మార్గానికి నిధులు కేటాయింపే జరగలేదు. పగిడిపల్లి నుంచి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి జంక్షన్ వరకు రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉంది. పగిడిపల్లి నుంచి గల సింగిల్ లైన్‌తో ప్రయాణం సాగుతోంది. దక్షిణ, తూర్పు ప్రాంత ప్రజలకు ఈ మార్గం ద్వారా రైలు ప్రయాణం సాగుతోంది.
సింగిల్ లైన్ తో క్రాసింగ్‌లతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను సైతం ఆపక తప్పడం లేదు. గంటల తరబడి క్రాసింగ్‌లతో ప్రయాణకాలం పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబంగాల్, కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానం గల ఈ మార్గంపై నిర్లక్ష్యం కొనసాగడం ప్రయాణికులను వేదనకు గురిచేస్తోంది.అయితే పగిడిపల్లి నుంచి నల్లపాడు వరకు విద్యుద్దీకరణ పనులు పూర్తి కావొస్తున్నాయి.
బీబీనగర్‌లో రైల్వే జంక్షన్ అంతే!
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు కూతవేటు దూరంలో బీబీనగర్‌లో నడికుడి రైల్వేలైన్ ఏర్పాటు చేసి ఆ క్రమంలోనే జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా 50 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వేసిన మొదటి రైల్వేలైన్ నడికుడి – బీబీనగర్ మార్గం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1977లో బీబీనగర్ – నడికుడి రైల్వే లైన్‌ను ప్రారంభించారు.
ఈ మార్గం ద్వారా దక్షిణాదికి రవాణా మార్గం సులభతరం చేశారు. నిత్యం గూడ్స్, ప్యాసింజర్లు, ఎక్స్‌ప్రెస్‌రైళ్లు.. బీబీనగర్ – నడికుడి మార్గంగా ప్రయాణం సాగుతున్నాయి. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేకు అనుబంధంగా బీబీనగర్, పగిడపల్లి, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ల వరకు రైలు లైన్లను విస్తరించి జంక్షన్ కోసం ప్రతిపాదనలు చేశారు. బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతం రైల్వే జంక్షన్‌గా రూపాంతరం చెందితే ఈ ప్రాంత నిరుద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉండేవి. రైల్వే ద్వారా బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమలకు ముడి సరుకుల రవాణా సదుపాయాలు పెరుగుతాయి.
మౌలిక వసతులు కల్పించాలి
పగిడిపల్లి రైల్వేస్టేషన్లో మౌలిక వసతులు లేకుండాపోయాయి. రైలు కోసం ఆగిన ప్రయాణికులకు ఎండలో నిలబడాల్సి వస్తోంది. దీంతో పాటు తాగునీరు, ఫ్యాన్లు లేకుండాపోయాయి. ప్రయాణికులు గంటల కొద్దీ నిలబడాల్సి రావడంతో ఎలాంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందువల్ల సౌకర్యాలు కల్పించాలి.
–వెంకటరమణ, ప్రయాణికుడు
ప్లాట్‌ఫామ్ నిర్మించాలి
రైల్వేస్టేషన్ మోడల్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ది చేయాలని ఈ రైల్వే స్టేషన్ ఉద్యోగులు నల్లగొండ నుంచి రాకపోకలు సాగించడం కోసం అనువుగా ఉంది. ప్రతిరోజూ 150మంది ప్రయాణికులు వస్తుంటారు. వీరు రైలు ఎక్కే సమయంలో ప్లాట్ఫారం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పగిడిపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ది చేయాలి.
– గిరిజ, ఉద్యోగి, ప్రయాణికురాలు