రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
190 సంచుల రేషన్ బియ్యం పట్టివేత
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల రైల్వే స్టేషన్లో బుధ, గురువారాల్లో పలు రైళ్లలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. రైల్వే ఎస్సై మునీరుల్లా కథనం ప్రకారం.. బుధవారం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో 105 రేషన్ బియ్యం సంచులు, నాగ్పూర్ ప్యాసింజర్ రైలులో 65 సంచుల రేషన్ బియ్యం, గురువారం ఉదయం రామగిరి రైలులో 20 సంచుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ బియ్యం మొత్తం 70 క్వింటాళ్లు ఉంటుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జగన్, సిబ్బంది ప్రవీన్, శ్రీహరి, నరేందర్, సంపత్, ఉస్మాన్, రవికిషోర్ రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించగా రేషన్ బియ్యం సంచులు లభించాయి.
అయితే.. ఈ బియ్యం సంచులు రైళ్లలో సీట్ల కింద ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంట, ఉప్పల్, పొత్కపల్లి, పెద్దంపేట, రవీంద్రఖని, మందమర్రి ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం పెద్దఎత్తున మహారాష్ట్రలోని విరూర్కు తరలిపోతోందని ఆయన చెప్పారు. రెవెన్యూ అధికారులు సహకరిస్తే బియ్యం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికడుతామంటున్నారు.