railway station checking
-
పోలీసుల నిఘాలో రైల్వే స్టేషన్
తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్లో పోలీసుల నిఘా ఇటీవల పెంచారు. ప్రయాణికులకు సరైన భద్రత కల్పించడంతోపాటు ఎర్రచందనం స్మగ్లర్ల జాడను గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కేంద్రంలో పలు ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు చేరుకుంటున్నట్లు సమాచారం అందడంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైళ్లను నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు పలు బృందాలుగా వెళ్లి చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దానికితోడు ప్రయాణికుల తాకిడి బాగా పెరిగింది. గతంలో ప్రయాణికులు 60వేల నుంచి 70వేలమంది వచ్చేవారని రైల్వే అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో 70వేల నుంచి 80వేల మంది ప్రయాణికులు వస్తున్నట్లు రైల్వే అధికారుల తాజా లెక్కలు చూపుతున్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతోపాటు డాగ్స్క్వాడ్ సిబ్బంది తనిఖీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుని సమీపంలోని అటవీ ప్రాంతాలకు చొరబడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చినట్లు చర్చసాగుతుంది. దాంతో తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 24గంటలు రైల్వే పోలీసులు స్టేషన్లో డేగకళ్లతో నిఘా పెట్టారు. -
డబ్లింగ్ ట్రాక్, రైల్వేస్టేషన్ల తనిఖీలు
హిందూపురం అర్బన్: రైల్వే ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఎ.కె. గుప్త అన్నారు. డీఆర్ఎం ఆర్.ఎస్. సక్సెనా, అశోక్గుప్తలతో కలిసి బెంగళూరు నుంచి ప్రత్యేక రైలులో హిందూపురం చేరుకున్న ఆయన, పెనుకొండ, హిందూపురం మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పరిశీలించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణాలపై అధికారులతో చర్చించారు. తర్వాత హిందూపురం రైల్వేస్టేషన్ను పరిశీలించారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించడంలో అలసత్వం ఉండబోరాదని సిబ్బందికి సూచించారు. రైలు ప్రయాణ వేళల డిస్ప్లే బోర్డుల ఏర్పాటుపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా జీఎంకు మజ్దూర్ యూనియన్ నాయకులు సన్మానం చేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి శేఖర్, బ్రాంచ్ కార్యదర్శి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు.