నవంబర్ 23 నుంచి రైల్వేలలో నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: రైల్వేలలో సంస్కరణల పేరిట డాక్టర్ బిబేక్దేబ్ రాయ్ ప్రతిపాదిస్తున్న నివేదికను వ్యతిరేకిస్తూ నవంబర్ 23 నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్, దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. రైల్వేలలో విదేశీ పెట్టుబడులను అమలు చేయబోమని ప్రధాని మోదీ వారణాసి సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కోరారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రైల్వేలను నిర్వీర్యం చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
రెండున్నర కోట్ల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న భారత రైల్వేలు 11 వందల మిలియన్ టన్నుల సరుకు రవాణాతో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచాయన్నారు. ఈ తరుణంలో వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే యత్నించడం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలనుకోవడం దారుణమన్నారు. రైల్వేశాఖకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని,దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను,దక్షిణమధ్య రైల్వేలో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూస్, సంయుక్త కార్యదర్శి కె.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.