‘సాక్షి’ సాగుబడికి రైతు నేస్తం అవార్డు
ఈ నెల 11న ప్రదానం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ ప్రత్యేక వ్యవసాయ అనుబంధం సాగుబడికి రైతు నేస్తం పురస్కారం దక్కింది. రైతు నేస్తం పురస్కారాలు-2016కు ఎంపికైన జాబితాను రైతు నేస్తం మేగజైన్ ఎడిటర్ వై. వెంకటేశ్వర్ రావు మంగళవారం విడుదల చేశారు. రైతులకు విలువైన సలహాలు, సూచనలు అందించడంలో సాగుబడి డెస్క్ కృషిని ప్రశంసిస్తూ ఈ అవార్డుకు ఎంపికచేశారు. అగ్రి జర్నలిజం విభాగంలో ‘సాక్షి’ సాగుబడితోపాటు మరో 5 సంస్థలు కూడా ఎంపికయ్యాయి.
ఇదే విభాగంలో మరో ఐదుగురు ఎంపికయ్యారు. రైతు నాయకులు డాక్టర్ యలమంచిలి శివాజీకి జీవన సాఫల్య పురస్కారం, ఎం.కోదండరెడ్డికి విశిష్ట అవార్డును ప్రకటించారు. రైతు విభాగంలో 18 మంది రైతులకు పురస్కారాలు ప్రకటించారు. శాస్త్రవేత్తల విభాగంలో తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కె.కేశవులు, వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎ.సుజాతలకు దక్కాయి.
ఈ విభాగంలో మరో 10 మందిని ఎంపికచేశారు. సాగు విస్తరణ విభాగంలో 13 మందికి అవార్డుల్ని ప్రకటించారు. ఈ అవార్డులను ఈ నెల 11న హైదరాబాద్‌లో ప్రదానం చేస్తారు. ముఖ్య, విశిష్ట అతిథులుగా కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావులు హాజరుకానున్నారు.