raitubazar
-
నేటి నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు రైతుబజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.25కే విక్రయిస్తుండగా ఆదివారం నుంచి అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 85 రైతుబజార్లు ఉండగా అందులో ఇప్పటికే 80 రైతుబజార్లలో ఉల్లి అందుబాటులో ఉంది. బయటి మార్కెట్లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.100 వరకు ఉండగా రైతుబజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తుండటంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది. అయితే.. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి రైతుబజార్లకు చేరుస్తున్నారు. మొదటి రెండు రోజులు ఉల్లిపాయల రవాణాలో కొంత జాప్యం జరగడంతో మారుమూల రైతుబజార్ల అవసరాలకు సరిపోను ఉల్లిపాయలు రాలేదు. దీంతో ధర మరింత పెరగొచ్చనే ఉద్దేశంతో రైతుబజార్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా.. ధరల స్థిరీకరణ నిధితో ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయల కొనుగోలు, రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా రైతుల నుంచి కిలో రూ.48 నుంచి రూ.55 ధరకు మార్కెటింగ్ శాఖ ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కర్నూలు జిల్లా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ కర్నూలు ఉల్లినే కొనుగోలు చేస్తోంది. పండిన పంటనంతటినీ కర్నూలు రైతుల నుంచి కొనుగోలు చేశాకే ఇతర రాష్ట్రాల ఉల్లిని దిగుమతి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు ఎక్కువ ఉల్లి చేరాక కిలోకి మించి అమ్మాలని భావిస్తున్నారు. అవసరమైతే కౌంటర్లు పెంచుతాం నిర్ణీత సమయాలతో సంబంధం లేకుండా రైతుబజార్లకు చేరిన ఉల్లిపాయలను విక్రయిస్తాం. అవసరమైతే కౌంటర్ల సంఖ్యను పెంచుతాం. – ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ -
ట‘మోత’
–కిలో రూ.60 కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్) : పప్పు కూరల్లో తరచూ వాడే టమాట ధర అమాంతం పెరిగింది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 వరకు ఉండగా..ఇప్పుడు ఏకంగా రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. కర్నూలు రైతు బజారులో కిలో రూ.60లకు విక్రయిస్తుండగా, బయట మార్కెట్లో రూ.70 వరకూ అమ్ముతున్నారు. దీంతో టమాట కొనేందుకు పేద, మధ్య తరగతి వారు వెనకడుగు వేస్తున్నారు. టమాటతో పాటు మిర్చి ధర కూడా పెరిగింది. కిలో రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. ధరలు నిలకడగా ఉన్నప్పుడు టమాట చట్నీ, పచ్చికారం చట్నీతో టిఫిన్ వడ్డించే హోటళ్లలో నేడు నీరు, కారం కలిపిన పళ్లీల చట్నీతోనే సరిపెడుతున్నారు. ఓ మోస్తరు హోటళ్లు మినహాయిస్తే చిన్న చిన్న కాకా హోటళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కర్రీ పాయింట్ల విషయానికొస్తే కేవలం చట్నీ, ఆకుకూరతోనే సరిపెడుతున్నారు. దీంతో కర్రీ పాయింట్లపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగులు చట్నీ భోజనంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. -
దగా మిత్ర!
గృహమిత్ర దుకాణాల్లో దోపిడీపర్వం – షాపు, సరుకుల పేర్లు లేకుండానే బిల్లు – సరుకుల్లోనూ ద్వితీయ శ్రేణి నాణ్యత – కన్నెత్తి చూడని మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు – పట్టనట్లుగా తూనికలు, కొలతల శాఖ ఈ చిత్రంలోని మహిళ పేరు కృష్ణవేణమ్మ. కర్నూలు గణేష్‌నగర్ నివాసి. కర్నూలు సి.క్యాంప్ రైతుబజార్‌లోని గృహమిత్ర కౌంటర్–1లో రూ.1,236 విలువ చేసే సరుకులు కొన్నారు. అయితే షాపు పేరు, తీసుకున్న సరుకు పేరు, క్వాంటిటీ లేకుండా కేవలం ధరతో బిల్లు ఇవ్వడం వల్ల ఏ సరుకు ఎంతకు కొనుగోలు చేశామో తెలుసుకునే వీలు లేకుండా పోయింది. ఇదేమిటంటే.. అంతేననే సమాధానం వచ్చింది. రైతు బజార్లో దోపిడీకి ఇదొక ఉదాహరణ మాత్రమే. కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన కర్నూలు సి.క్యాంప్ రైతుబజార్ ప్రతిష్ట దిగజారుతోంది. జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ధరల నియంత్రణ కొరవడింది. నాణ్యత విషయంలో వినియోగదారుల సదాభిప్రాయం కాస్తా రోజురోజుకు సన్నగిల్లుతోంది. సూపర్ బజార్ ధరలతో విక్రయిస్తుండటం.. ఏ సరుకు ఎంత ధర ఉందో తెలుసుకునే అవకాశం లేని విధంగా బిల్లులు ఇవ్వడం వల్ల దోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా బహిరంగమే అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక మామూళ్లే కారణమనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో బెల్లం ధర రూ.50 నుంచి రూ.54 వరకు ఉంది. మాల్స్, సూపర్ మార్కెట్లలో ధర రూ.55 పలుకుతోంది. బయటి మార్కెట్‌తో పోలిస్తే గహమిత్ర కౌంటర్లలో రూ.2 నుంచి రూ.5ల వరకు ధర తక్కువ ఉండాలి. అలా కాకుండా సూపర్ మార్కెట్ ధరకు దీటుగా విక్రయిస్తుండటం చూస్తే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తోంది. నాణ్యత అయినా బాగుందా అంటే అదీ లేదు. ద్వితీయ శ్రేణి నాణ్యతతో సరుకులను అంటగడుతున్నారు. బినామీల తిష్ట రైతు బజార్లో 10 షాపులు ఉండగా.. చాలా వరకు బినామీలు తిష్ట వేశారు. గృహమిత్ర కౌంటర్–1 చౌక దుకాణ డీలర్ కరుణాకర్ గుప్తకు కేటాయించారు. గృహమిత్ర–2 షాపును మరో డీలర్ పక్కీరయ్య దక్కించుకున్నారు. నిరుద్యోగులకు కాకుండా డీలర్లకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. గృహమిత్ర–1 బాడుగ రూ.5వేలు, గృహమిత్ర–2 బాడుగ రూ.4వేలు కాగా.. ఇతరులకు అధిక మొత్తానికి బాడుగకు ఇచ్చినట్లు సమాచారం. డ్రైఫ్రూట్స్ వ్యాపారానికి ఒక కౌంటర్‌ను అల్తాఫ్ హుసేన్‌కు కేటాయిస్తే.. ఇందులో కిరాణం వ్యాపారం ఇతరులు నిర్వహిస్తున్నారు. గృహమిత్ర 1, 2 షాపులను మినహాయిస్తే మిగిలిన వాటి బాడుగలన్నీ రూ.3500 మాత్రమే. అయితే దుకాణాలు దక్కించుకున్న వ్యక్తులు వీటిని ఇతరులకిచ్చి అధిక బాడుగ వసూలు చేస్తున్నారు.