దగా మిత్ర!
దగా మిత్ర!
Published Wed, Aug 3 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
గృహమిత్ర దుకాణాల్లో దోపిడీపర్వం
– షాపు, సరుకుల పేర్లు లేకుండానే బిల్లు
– సరుకుల్లోనూ ద్వితీయ శ్రేణి నాణ్యత
– కన్నెత్తి చూడని మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు
– పట్టనట్లుగా తూనికలు, కొలతల శాఖ
ఈ చిత్రంలోని మహిళ పేరు కృష్ణవేణమ్మ. కర్నూలు గణేష్‌నగర్ నివాసి. కర్నూలు సి.క్యాంప్ రైతుబజార్‌లోని గృహమిత్ర కౌంటర్–1లో రూ.1,236 విలువ చేసే సరుకులు కొన్నారు. అయితే షాపు పేరు, తీసుకున్న సరుకు పేరు, క్వాంటిటీ లేకుండా కేవలం ధరతో బిల్లు ఇవ్వడం వల్ల ఏ సరుకు ఎంతకు కొనుగోలు చేశామో తెలుసుకునే వీలు లేకుండా పోయింది. ఇదేమిటంటే.. అంతేననే సమాధానం వచ్చింది. రైతు బజార్‌లో దోపిడీకి ఇదొక ఉదాహరణ మాత్రమే.
కర్నూలు(అగ్రికల్చర్):
రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన కర్నూలు సి.క్యాంప్ రైతుబజార్ ప్రతిష్ట దిగజారుతోంది. జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ధరల నియంత్రణ కొరవడింది. నాణ్యత విషయంలో వినియోగదారుల సదాభిప్రాయం కాస్తా రోజురోజుకు సన్నగిల్లుతోంది. సూపర్ బజార్ ధరలతో విక్రయిస్తుండటం.. ఏ సరుకు ఎంత ధర ఉందో తెలుసుకునే అవకాశం లేని విధంగా బిల్లులు ఇవ్వడం వల్ల దోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా బహిరంగమే అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక మామూళ్లే కారణమనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో బెల్లం ధర రూ.50 నుంచి రూ.54 వరకు ఉంది. మాల్స్, సూపర్ మార్కెట్‌లలో ధర రూ.55 పలుకుతోంది. బయటి మార్కెట్‌తో పోలిస్తే గహమిత్ర కౌంటర్లలో రూ.2 నుంచి రూ.5ల వరకు ధర తక్కువ ఉండాలి. అలా కాకుండా సూపర్ మార్కెట్ ధరకు దీటుగా విక్రయిస్తుండటం చూస్తే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తోంది. నాణ్యత అయినా బాగుందా అంటే అదీ లేదు. ద్వితీయ శ్రేణి నాణ్యతతో సరుకులను అంటగడుతున్నారు.
బినామీల తిష్ట
రైతు బజార్‌లో 10 షాపులు ఉండగా.. చాలా వరకు బినామీలు తిష్ట వేశారు. గృహమిత్ర కౌంటర్–1 చౌక దుకాణ డీలర్ కరుణాకర్ గుప్తకు కేటాయించారు. గృహమిత్ర–2 షాపును మరో డీలర్ పక్కీరయ్య దక్కించుకున్నారు. నిరుద్యోగులకు కాకుండా డీలర్లకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. గృహమిత్ర–1 బాడుగ రూ.5వేలు, గృహమిత్ర–2 బాడుగ రూ.4వేలు కాగా.. ఇతరులకు అధిక మొత్తానికి బాడుగకు ఇచ్చినట్లు సమాచారం. డ్రైఫ్రూట్స్ వ్యాపారానికి ఒక కౌంటర్‌ను అల్తాఫ్ హుసేన్‌కు కేటాయిస్తే.. ఇందులో కిరాణం వ్యాపారం ఇతరులు నిర్వహిస్తున్నారు. గృహమిత్ర 1, 2 షాపులను మినహాయిస్తే మిగిలిన వాటి బాడుగలన్నీ రూ.3500 మాత్రమే. అయితే దుకాణాలు దక్కించుకున్న వ్యక్తులు వీటిని ఇతరులకిచ్చి అధిక బాడుగ వసూలు చేస్తున్నారు.
Advertisement
Advertisement