మీ ధోరణితోనే ఘోర పరాజయం
సాక్షి, కాకినాడ :‘అధికారంలో ఉన్నప్పుడు డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లకు, పైరవీలు చేసే వారికి పదవులు కట్టబెట్టారు. వారంతా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి వదిలేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. కనీసం మీరు కూడా ఏనాడూ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ స్వార్థం లేకుండా పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న మమ్మల్ని గుర్తించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ అగ్రనేతల ఎదుట కుండబద్దలు కొట్టారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వారు తమ అంతరంగాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా వెల్లడించారు.
పార్టీ దుస్థితికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఇప్పటికైనా మేలుకోకపోతే మరో పాతికేళ్లయినా పార్టీ బలోపేతం కాదని హెచ్చరించారు. కాకినాడ వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో తొలుత నాయకులు ప్రసంగించాక నియోజకవర్గాల వారీ అంతర్గతంగా నిర్వహించిన సమీక్షల్లో కార్యకర్తలు నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వెల్లడించారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమీక్షలు జరిగాయి. జిల్లా పరిశీలకులుగా నియమితులైన మాజీ మంత్రి పి.బాలరాజు, అప్పలనర్శయ్య, రమణమూర్తి, రాఘవరాజులతో పాటు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి,
మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు, పీసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఓటమి చెందిన అభ్యర్థులతో పాటు పార్టీనే అంటిపెట్టుకున్న కార్యకర్తలతో సమావేశమై వారి మనోగతం వినేందుకు ప్రయత్నించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని కార్యకర్తలకు అండగా నిలిస్తే, వారే పార్టీని బతికించుకుంటారని చెప్పుకొచ్చారు. కార్యకర్తల మనోగతాలను ఓపిగ్గా విన్న అగ్రనేతలు పార్టీకి జవ సత్వాలు నింపేందుకు త్వరలోనే త్రిసభ్య కమిటీ నియోజక వర్గాలవారీ పర్యటించి కార్యకర్తల అభీష్టం మేరకు నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు.
విభజన పాపం అందరిదైనా..బలిపశువైంది మనమే..
నేతలంతా మధ్యాహ్నం 2 గంటల వరకు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టేశారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడైన సినీ నటుడు చిరంజీవి అభిమానులే ఎక్కువగా కనిపించారు. చిరంజీవి వెళ్లిపోగానే సమావేశ మందిరం దాదాపు ఖాళీ అయిపోయింది. తొలుత నేతల ప్రసంగాల్లో విభజన పాపంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉన్నా కాంగ్రెస్‌నే ప్రజల ఎదుట బలిపశువుగా నిలబెట్టారని, అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విభజనలో కాంగ్రెస్ తప్పులేదని నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఓటమి తప్పదని ఊహించినా ఇంత చిత్తుగా ఓడిపోతామనుకోలేదని వాపోయారు. పదవులను పొందిన ఎందరో పార్టీని వీడినా తామంతా నిబద్ధతతో పనిచేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. మూడునెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న చంద్రబాబు ఎంతోకాలం అధికారంలో ఉండలేడని, కాస్త ఓపిక పడితే మళ్లీ అధికారంలోకి రావడానికి ఏమంత సమయం పట్టదని కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.
సీల్డ్ కవర్ కమిటీలకు స్వస్తి చెప్పండి..
కాగా పై నుంచి నాయకత్వాన్ని రుద్దే పద్ధతిని ఇకనైనా విడనాడాలని, సీల్డ్ కవర్లో కమిటీల ఏర్పాటుకు స్వస్తిచెప్పాలని, కార్యకర్తలు సూచించిన వారికే పదవులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సూచించారు. కార్యకర్తలను పట్టించుకోక పోవడం వలనే ఈ దుస్థితి దాపురించిందని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవితో సహా సభావేదికపై ఉన్న తామంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నట్టు దుష్ర్పచారం చేస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సైతం ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
డుమ్మా కొట్టిన నేతలు
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయానికి దారితీసిన పరిస్థితులపై తొలిసారిగా కాంగ్రెస్ పోస్టుమార్టం నిర్వహించింది. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడమే కాక పార్టీ కోసం పనిచేసిన తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, పొన్నాడ సతీష్‌కుమార్, కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, వంగా గీతలతో పాటు చివరకు పార్టీ ఎమ్మెల్సీ రత్నాబాయి కూడా సమావేశానికి ముఖం చాటేశారు. పార్టీ తరపున అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యేల్లో పాముల రాజేశ్వరీదేవి హాజరు కాగా, కాశీ విశ్వనాథరెడ్డి గైర్హాజరయ్యారు.