Raja Bhaiya
-
ఎన్నికల వేళ కొత్త పార్టీ
లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని నగరాల పేర్లు మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడు ప్రదర్శిస్తుండగా, బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నప్పటికి ఎస్పీ, బీఎస్పీలు పొత్తుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్ర ఎమ్మెల్యే, ఠాకూర్ నేత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా కొత్త పార్టీ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన రాజా భయ్యా శుక్రవారం తాను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇప్పటిదాకా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలుపొందానని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. త్వరలోనే ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి పార్టీ పేరును రిజిస్టర్ చేయిస్తానని పేర్కొన్నారు. వారికి రిజర్వేషన్లు అక్కర్లేదు.. ‘రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందిన సివిల్ సర్వెంట్లు రిజర్వేషన్‌ను వదులుకుంటే బాగుంటుంది. వారికి ఒకసారి ఆ ఫలాలు అందాయి కాబట్టి ఎంతోకొంత ఆర్థిక స్వాలంబన లభిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ వదులుకుంటే వాళ్ల కమ్యూనిటీలోనే ఉన్న మరికొంత మంది నిరుపేదలకు లబ్ది చేకూరుతుంది’ అని రాజా భయ్యా వ్యాఖ్యానించారు. ఇక పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. కుల ప్రాతిపదికన కాకుండా ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఏదైనా ఒక ఘటనలో బాధితులు దళితులా లేదా మరే ఇతర సామాజిక వర్గానికి చెందిన వారా అనే తేడా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించినపుడే సమన్యాయం పాటించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎస్పీ- బీఎస్పీ ఓట్లు చీల్చేందుకేనా? అయితే ఇన్నాళ్లుగా అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితుడిగా మెదిలిన రాజా భయ్యా ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించిన సమయంలో... రిజర్వేషన్ల గురించి మాట్లాడిన తీరు చూస్తే రాజా భయ్యా పార్టీ అనుసరించే విధానాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రవర్ణాల మెప్పు పొందేందుకే ఆయన ఇలా మాట్లాడారని, ఆయన మాటల్లో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనబడుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎస్పీ-బీఎస్పీ ఓట్లు చీల్చేందుకే రాజా భయ్యా చేత బీజేపీ కొత్త పార్టీ పెట్టించిందనే వాదనలూ విన్పిస్తున్నారు. -
నా కళ్లు తెరిపించాడు: అఖిలేశ్
సాక్షి, లక్నో: ఇటీవల గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ సహకారంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ సహకారం అందించినా బీఎస్పీ అభ్యర్థి మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బీఎస్పీ ఓటమి కంటే కూడా తమకు మద్దతిస్తున్న నేతల చర్యలతోనే ఎక్కువ నష్టం జరగిందని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. తన కళ్లు ఇప్పటికైనా తెరుచుకున్నాయని కొన్ని విషయాలు ప్రస్తావించారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ సీఎం మాయావతిపై తీవ్ర విమర్శలు చేసిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఇకపై ఎస్పీ మద్దతుదారుడిగా కొనసాగరని అఖిలేశ్ అన్నారు. తన ఓటు కచ్చింగా ఎస్పీకే చెందుతుందని రాజా భయ్యా చెప్పగా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసిన అఖిలేశ్ అనంతరం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. మాకు సహకరించే వ్యక్తి అని నమ్మినప్పుడు ట్వీట్ చేశాను.. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేయడంతో పోస్ట్ తొలగించానని అఖిలేశ్ తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలతో రాజా భయ్యా తన కళ్లు తెరిపించాడని, ఆయనను నమ్మవద్దని మాయావతి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అఖిలేశ్ గుర్తుచేశారు. బీజేపీ ఇచ్చిన విందు పార్టీకి రాజా భయ్యా హాజరుకావడం కూడా అఖిలేశ్, మాయావతిలకు మింగుడు పడటం లేదు. తొలుత లోక్‌సభ ఉప ఎన్నికల వరకే బీఎస్పీ-ఎస్పీ పొత్తు కొనసాగుతుందని చెప్పిన మాయావతి రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాట్లాడుతూ.. మా మైత్రి ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ కూటమికి, పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ కూటమికే మొగ్గు చూపుతున్నట్లు అఖిలేశ్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోకి మళ్లీ రాజాభయ్యా
వివాదాస్పద ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా.. మళ్లీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అయ్యారు. దాదాపు ఏడునెలల విరామం తర్వాత ఆయన మళ్లీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రతాప్‌గఢ్‌లో డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సీబీఐ ఆయనపై కేసును మాఫీ చేయడంతో సీఎం అఖిలేష్ యాదవ్ వెంటనే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్, సీనియర్ మంత్రి ఆజంఖాన్‌ల సమక్షంలో గవర్నర్ బీఎల్ జోషి రాజాభయ్యాతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే రాజాభయ్యాకు ఇంకా శాఖ మాత్రం కేటాయించలేదు. ఇంతకుముందు ఆయన ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు సీబీఐ దర్యాప్తు కూడా పూర్తి కాకముందే మీడియా మాత్రం తనను దోషిగా నిర్ధారించేసింంటూ రాజా భయ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.