విద్యుత్తు కోతలకు స్వస్తి?
సాక్షి, విజయవాడ : రాబోయే మూడు నాలుగు నెలలు విద్యుత్తు కోతల బాధలు తప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నీటితో నిండడంతో విద్యుత్తు ఉత్పత్తి పూర్తిస్థాయికి చేరినట్లు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు వరకు విద్యుత్ కోతలు ఉండబోవని, ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి వచ్చే జనవరి వరకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రోజూ 11 మిలియన్ల యూనిట్లు వినియోగం
జిల్లాలో రోజూ 11 మిలియన్ యూనిట్లు వినియోగం ఉంది. ఎన్టీటీపీఎస్తో పాటు ఇతర ధర్మల్ పవర్ స్టేషన్లు పూర్తిసామర్థ్యంతో పనిచేయడం, వాతావరణం చల్లబడటంతో విద్యుత్తు వినియోగం తగ్గిందని అధికార లెక్కలు చెబుతున్నారు. ప్రసుత్తం రోజుకు సరాసరి 9.8 మిలియన్ యూనిట్లు మాత్రమే ఖర్చవుతోంది. డిమాండ్ కంటే సప్లయి ఎక్కువగా ఉండడంతో కోతలకు స్వస్తి పలికినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు కూడా రోజుకు ఏడు గంటలపాటు క్రమం తప్పకుండా సరఫరా ఇస్తున్నట్లు వారు వివరిస్తున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 72గంటల సమ్మెకు విద్యుత్తు ఉద్యోగులు దిగడంతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తొలుత కంగారు పడ్డారు. ఎన్టీటీపీఎస్లోని ఇంజినీరింగ్ అధికారులు సమ్మెలోకి వెళ్లకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీటీపీఎస్లోని ఏడు యూనిట్లు పూర్తి స్థామర్థ్యంతో పనిచేస్తూ 1760 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాయి.