కిరణ్ పార్టీకి నైతిక మద్దతు: లగడపాటి
మాజీ సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే నైతికంగా తన మద్దతుంటుందని లోక్సభ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం శనివారం తొలిసారిగా విజయవాడ వచ్చిన లగడపాటి మాట్లాడుతూ.... రాజకీయాల్లో యువనాయకులను ప్రోత్సహించాలన్నారు. రాజగోపాల్ ఫౌండేషన్ ద్వారా సీమాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు లగడపాటి పునరుద్ఘాటించారు.
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంతో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ లోక్సభ సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావులు సొంత పార్టీపై లోక్సభలో అవిశ్వాసం పెట్టారు. దీంతో ఆగ్రహించిన అధిష్టానం అయా ఎంపీలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించింది. అయితే లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందడంతో తాను రాజకీయా సన్యాసం తీసుకుంటున్నట్లు లగడపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే.