కన్నీటి గోదారి
పుణ్యస్నానానికని వెళితే పుణ్యలోకాలు ప్రాప్తించాయి. గోదావరి పుష్కర మహోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లిన జిల్లా వాసులకు అనుకోని విషాదం ఎదురైంది. పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో ఐదుగురు జిల్లావాసులు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగాయి.
కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి..
- భోరుమన్న మహాలక్ష్మి కుటుంబీకులు
- విషాదంలో కేఆర్ఎం కాలనీ
మద్దిలపాలెం : రాజమండ్రి గోదావరిలో పుష్కర స్నానాలకని వెళ్లిన తల్లి విగతజీవిగా మారిందన్న వార్త ఆ కుటుంబ సభ్యులను దుఃఖసాగరంలో ముంచింది. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబ సభ్యులు భోరున రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రిలేరు, ఇప్పుడు తల్లి కూడా దూరమైపోయిందన్న వేదనలో ఉన్న పిల్లలను ఓదార్చడానికి కూడా ఎవరూ సాహసించలేకపోయారు.
పుణ్యస్నానానికి వెళ్లి వస్తానని చెప్పిన తన తల్లి విగతజీవిగా వస్తుందన్న వార్తను కుటుంభ సభ్యులు,గ్రామస్తులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. జీవీఎంసీ 10వ వార్డు పరిధి కె.ఆర్.ఎమ్.కాలనీకి చెందిన కోటిన మహాలక్ష్మి(68) సీతమ్మధార నాలుగో పట్ణణ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న తన అక్క కుటుంబంతో కలసి సోమవారం రాత్రి రాజమండ్రి వెళ్లింది.
మంగళవారం ఉదయం పుష్కరస్నానం కోసం వెళ్లడానికి ప్రయత్నించిన క్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడింది. మహాలక్ష్మి మరణవార్తను టీవీల ద్వారా తెలుసుకున్న కుటుంభ సభ్యులు రాజమండ్రిలో సమీప బంధువులను ఆరా తీసి నిర్ధారించుకుని నిశ్చేష్టులయ్యారు. మహాలక్ష్మి భర్త చిన్నంనాయుడు విశ్రాంత పోర్టు ఉద్యోగి, 1994లో విధుల నుంచి రిటైరయిన చిన్నంనాయుడు 2002లో మరణించాడు. వీరికి ఒక కుమారుడు నాగభీమకొండలరావు, ఇద్దరు కుమార్తెలు శ్రీదేవి, భాగ్యలక్ష్మి ఉన్నారు. కుమార్తెలు ఇద్దరూ వివాహితులు, పెద్ద కుమార్తె శ్రీదేవి, భర్తతో కలసి స్థానికంగా ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. చిన్నకుమార్తె భాగ్యలక్ష్మికి బీహార్‌కి చెందిన రైల్వే ఉద్యోగితో వివాహం కావడంతో అక్కడే స్థిరపడ్డారు. కుమారుడు నాగభీమ కొండలరావు వికలాంగ నిరుద్యోగి, కేవలం తల్లికి వచ్చే పింఛనుతో కుటుంబ పోషణ చేసుకునేవారు.
ఇప్పుడు తల్లి మరణంతో వారు దిక్కులేని వారైపోయారు. ఈ దుర్ఘటన కె.ఆర్.ఎమ్.కాలనీలో విషాదచాయలు నింపింది. స్వతహాగా స్నేహశీలి అయిన మహాలక్ష్మి మరణాన్ని చుట్టుప్రక్కల ప్రజలను కూడా కంటతడి పెట్టించింది. మహాలక్ష్మి మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చి, బుధవారం ఉదయం అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని నగరానికి తీసుకురావడానికి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి ఆర్థికసాయం అందజేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక నాయకులు తమ సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహానికి స్థానిక మాజీ కార్పొరేటర్, వైయస్సార్సీపీ నాయకులు మొల్లి లక్ష్మి, అప్పారావు నివాళులు అర్పించారు.