రాజకపోతాసనం
కపోతం అంటే పావురం. ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి... ఠీవిగా నిలుచున్న కపోతాన్ని తలపిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని రాజకపోతాసనం అంటారు.
ఎలా చేయాలి?
వజ్రాసనంలో (ఒకటవ ఫొటోలో ఉన్నట్లు) వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి.
కుడికాలిని పూర్తిగా వెనుకకు చాపాలి. ఈ స్థితిలో కాలు పూర్తిగా నేలకు తాకుతుండాలి.
ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి మోచేతుల దగ్గర వంచి తల వెనుకకు తీసుకోవాలి. ఈ స్థితిలో తలను వీలయినంత వెనక్కి వంచాలి. ఇదే సమయంలో కుడి మోకాలిని వంచి అరికాలిని తల నుదురుభాగానికి తాకించాలి. తలమీద ఉన్న కుడిపాదాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ స్థితిలో చూపు ఆకాశం వైపు ఉండాలి. ఛాతీ భాగం ముందుకి నెట్టినట్లు ఉండాలి.
ఆసనం స్థితిలోకి వెళ్లిన తర్వాత శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి.
ఇదే క్రమాన్ని ఎడమకాలితో కూడా కొనసాగించాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.
ఉపయోగాలు ఇవి !
మోకాళ్లు, భుజాలు, మోచేతులు, తొడలు, శక్తిమంతం అవుతాయి.
థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. గొంతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. స్వరంలో స్పష్టత వస్తుంది.
ఛాతీ విశాలమవుతుంది. శ్వాససంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
అజీర్తి, మలబద్దకం తొలగిపోతాయి.
రుతుక్రమ సమస్యలతోపాటు ఇతర గర్భకోశ సమస్యలు కూడా నివారణ అవుతాయి.
వెన్నునొప్పి పోతుంది. శరీరం మొత్తం దృఢతరమవుతుంది.
జాగ్రత్తలు!
స్పాండిలోసిస్, హైబీపీ ఉన్నవాళ్లు చేయకూడదు.
మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు, భుజాల నొప్పులు, మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి), మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు చేయరాదు.
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు సప్తరుషి
యోగవిద్యాకేంద్రం, హైదరాబాద్
ఫొటోలు: శివ మల్లాల