పీఎంఓకి పేదవ్యక్తే దొరకలేదట!
ఓ పూట తిని, మరోపూట పస్తులుంటూ కాలాన్ని వెల్లబుచ్చే పేదవారు భారత్‌లో వీధికొక్కరైనా కనిపిస్తుంటారు. చాలా టీవీ షోలలో వారి ఆర్తనాదాలు వినిపించిన క్షణాలు లేకపోలేదు. అలాంటిది ప్రధానమంత్రి కార్యాలయానికి దేశంలో ఒక్క పేదవాడు కూడా దొరకలేదట. దేశంలో పేదవ్యక్తిగా ఎవరున్నారో గుర్తించడం కష్టమై, దాతృత్వ హృదయంతో పేదవాడికి దానం చేసిన చెక్‌ను తిప్పి పంపించేసింది.
రాజస్తాన్‌లోని శిఖర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ టీచర్ దీప్‌చంద్ శర్మ, 2015 జూన్ 10న లక్ష రూపాయల చెక్‌ను దేశంలోని పేదవ్యక్తికి సాయార్థంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ చెక్‌ను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. అయితే 2016 ఫిబ్రవరి 2న, ప్రధానమంత్రి కార్యదర్శి పీకే భళి, శర్మను సంప్రదించి, దేశంలో పేదవ్యక్తి ఎవరున్నారో గుర్తించకపోవడం వల్ల తను పంపిన చెక్‌ను సాయార్థంగా ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. పీఎమ్ రిలీఫ్ ఫండ్‌లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్టు చెప్పారు. తర్వాత ఆ లక్ష రూపాయల డిమాండ్ డ్రాప్ట్‌ను శర్మకు పంపించేశారు.