Rajasthan State
-
బాల్యవివాహాలు చేస్తే.. పురోహితులకు భరతం
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు రాష్ట్ర హోం శాఖ ఇటీవల వినూత్న ఆదేశాలను జారీ చేసింది. పిల్లల పెళ్లిళ్లు చేసే పురోహితుల భరతం పట్టాలని, అలాంటి పెళ్లిళ్లకు విందు భోజనాలను సరఫరాచేసే క్యాటరర్స్పై, టెంటులు, కుర్చీల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను ఆదేశించింది. ఏప్రిల్ 21న రానున్న అక్షయ తృతీయ, మే 4న రానున్న జేష్ట పూర్ణమిలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ రెండు రోజుల్లోనే రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరగుతాయి. 18 ఏళ్లలోపు బాలికలకు పెళ్లిళ్లు చేయరాదంటూ 2006లో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా వీటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. మొత్తం దేశంలోకెల్లా తక్కువ వయస్సుకే చట్టపరంగా పెళ్లిళ్లకు అనుమతిస్తున్న ఏకైక రాష్ట్రం రాజస్థానే. మిగతా రాష్ట్రాల్లో 20 ఏళ్లు నిండితేగానీ పెళ్లిళ్లు చట్టప్రకారం అనుమతించరు. వీటిని అరికట్టేందుకు యునెస్కో సహా పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవలి కాలంలో కొంత మార్పు వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, పేద కుటుంబాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద ప్రతి నలుగురు బాలికల్లో ఒకరు బాల్య వివాహానికి బలవుతూనే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో కుల పంచాయతీల ప్రాబల్యం ఎక్కువగా ఉండడం, వాటికీ ఓట్ల రాజకీయాలకు ప్రత్యక్ష సంబంధం ఉండడం. బాల్య వివాహానికి కుల పంచాయతీ అనుమతిస్తే అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా నోరు మూసుకోవాల్సిందే. లేదంటే ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుంది. -
అమ్మ పాల బ్యాంకుతో అభాగ్యులకు పునర్జన్మ
రాజస్థాన్ రాష్ట్రంలో సాధారణమైన ఒక మారుమూల గ్రామం అది. ఆ ఊళ్లో గౌరీమీనా అంతకంటే సాధారణమైన మహిళ. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కుదరని కుటుంబ నేపథ్యం. నెలలు నిండి మగపిల్లాడిని ప్రసవించింది. కానీ ఒక కేజీ రెండు వందల గ్రాముల బరువున్న బలహీనమైన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ బిడ్డను బతికించుకునేదెలా అని మీనాతోపాటు ఆమె భర్త దేవీలాల్‌కి కూడా భయం పట్టుకుంది. స్థానిక వైద్యుని సలహాతో బిడ్డను తీసుకుని ఉదయ్‌పూర్‌కు పరుగులు పెట్టారు. ఉదయ్‌పూర్‌లోని మహారాణా భోపాల్ జనరల్ హాస్పిటల్లో వైద్యుని ముందు నిలబడి ఉన్నారు దంపతులిద్దరూ. బిడ్డను పరీక్షించిన డాక్టరు మీనా, దేవీలాల్ వైపు సాలోచనగా చూశాడు. పుట్టీ పుట్టగానే బిడ్డపై ఇన్ఫెక్షన్ దాడి చేసింది. దానికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాలి. ఆ చికిత్సను తట్టుకోవాలంటే ముందు బిడ్డ శక్తిని పుంజుకోవాలి. ఈ స్థితిలో బిడ్డను కాపాడగలిగింది తల్లి పాలలోని గ్రోత్ హార్మోన్స్ మాత్రమే. పోషకాహార లోపం కారణంగా మీనాకు పాలు పడలేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తన బిడ్డ దక్కడని బిడ్డను ఒడిలో పెట్టుకుని కళ్లనీళ్ల పర్యంతమైంది మీనా. ఆ అద్భుతం తల్లి పాల బ్యాంకు రూపంలో ఉందని ధైర్యం చెప్పి నగరంలోని దివ్య మదర్ మిల్క్ బ్యాంకుకు సమాచారం అందించారు డాక్టర్. తమ బిడ్డల కడుపు నిండిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న పాలను పాలకు నోచుకోని బిడ్డలకు ఇచ్చే ప్రక్రియ ఇది. గత ఏడాది ఏప్రిల్‌లో ఉదయ్‌పూర్‌లోని ‘మా భగవతీ వికాస్ సంస్థాన్’ అనే ధార్మిక సంస్థ తల్లి పాల బ్యాంకును స్థాపించింది. ఇప్పటికి 660 మంది పాలిచ్చే తల్లులు పేరు నమోదు చేసుకున్నారు. వీరిచ్చే పాలతో ఉదయ్‌పూర్ హాస్పిటళ్లలోని నియో నేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న మీనా బిడ్డలాంటి 450 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. ఆరోగ్యవంతుడైన బిడ్డతో తమ ఊరికి బయలుదేరారు దేవీలాల్, మీనా దంపతులు. తమాషా ఏమిటంటే... తనకు ఇంకో బిడ్డ పుడితే. ఆ బిడ్డతో పాటు మరో బిడ్డకు కూడా పాలిస్తానని చెప్పింది మీనా. (ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవం )