బాల్యవివాహాలు చేస్తే.. పురోహితులకు భరతం | priests will be punished if they to do for child marriages | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు చేస్తే.. పురోహితులకు భరతం

Published Thu, Apr 16 2015 2:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

priests will be punished if they to do for child marriages

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు రాష్ట్ర హోం శాఖ ఇటీవల వినూత్న ఆదేశాలను జారీ చేసింది. పిల్లల పెళ్లిళ్లు చేసే పురోహితుల భరతం పట్టాలని, అలాంటి పెళ్లిళ్లకు విందు భోజనాలను సరఫరాచేసే క్యాటరర్స్‌పై, టెంటులు, కుర్చీల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను ఆదేశించింది. ఏప్రిల్ 21న రానున్న అక్షయ తృతీయ, మే 4న రానున్న జేష్ట పూర్ణమిలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ రెండు రోజుల్లోనే రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరగుతాయి. 18 ఏళ్లలోపు బాలికలకు పెళ్లిళ్లు చేయరాదంటూ 2006లో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా వీటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. మొత్తం దేశంలోకెల్లా తక్కువ వయస్సుకే చట్టపరంగా పెళ్లిళ్లకు అనుమతిస్తున్న ఏకైక రాష్ట్రం రాజస్థానే. మిగతా రాష్ట్రాల్లో 20 ఏళ్లు నిండితేగానీ పెళ్లిళ్లు చట్టప్రకారం అనుమతించరు.

 వీటిని అరికట్టేందుకు యునెస్కో సహా పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవలి కాలంలో కొంత మార్పు వచ్చినప్పటికీ  గ్రామీణ ప్రాంతాల్లో, పేద కుటుంబాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద ప్రతి నలుగురు బాలికల్లో ఒకరు బాల్య వివాహానికి బలవుతూనే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో కుల పంచాయతీల ప్రాబల్యం ఎక్కువగా ఉండడం, వాటికీ ఓట్ల రాజకీయాలకు ప్రత్యక్ష సంబంధం ఉండడం. బాల్య వివాహానికి కుల పంచాయతీ అనుమతిస్తే అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా నోరు మూసుకోవాల్సిందే. లేదంటే ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement