సాక్షి,రాజాం(శ్రీకాకుళం): ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది. ఐదేళ్ల కిందటకు ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఐదేళ్ల కిందటి వరకు అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపేద్దామనే ఆత్రుత జిల్లా ప్రజల్లో కనిపించేది. అధికారులు ఎంతగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా గ్రామాల్లో గుట్టుగా బాల్య వివాహాలు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధి విధానాలు, బాలల సంరక్షణ విభాగం పటిష్ట చర్యలు, గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి, బాలికల విద్యావకాశాలు మెరుగుపడడంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి.
బాలల సంరక్షణ విభాగం చొరవ
జిల్లాలో బాలల సంరక్షణ విభాగం చురుగ్గా పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ విభాగం సేవలు, నిత్య పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా వెళ్లాయి. ప్రధానంగా భారతీయ వివాహ చట్టాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చేరవేయగలిగారు. మరో వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్‌లైన్‌లు ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు చేయడం, ఎప్పటికప్పుడు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ద్వా రా చదువు మానేస్తున్న బాలికలను గుర్తించి వారి కి ఉన్నత విద్యను అందించే ఏర్పాట్లు చేయడం, బాలికల సంరక్షణ వసతిగృహాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి.
గత పదేళ్లలో..
గత పదేళ్లుగా చూసుకుంటే బాల్య వివాహాలు 2011 కంటే ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. 2011–12లో ఏడాదికి సగటున బాల్య వివాహాల నమోదు 395గా ఉండేది. 2018–20 మధ్య కాలంలో ఏడాదికి 163 నుంచి 128కి తగ్గుముఖం పట్టాయి. 2021–22 ఏడాదిలో ఈ వివాహాలు 54కి నమోదు కాగా, ఈ ఏడాదిలో ఈ మొత్తం బాల్య వివాహాలను బాలల సంరక్షణ విభాగం అడ్డుకోగలిగింది. (చదవండి: Scolded Drinking Habit: తమ్ముడి నిర్వాకం...సొంత అక్కపైనే అఘాయిత్యం )
పెరిగిన విద్యావకాశాలు..
ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు గ్రామాల్లో విద్యావకాశాలు బాగా పెరిగాయి. వైఎస్సార్ సీపీ వచ్చాక పాఠశాలలు, కాలేజీలు అభివృద్ధి చెందాయి. గతంలో పదో తరగతి వరకూ మాత్రమే ఆడపిల్లల చదువులు ఉండేవి. ఇప్పుడు ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో, బీ ఫార్మసీ వంటి కోర్సుల వైపు బాలికలు దృష్టి సారిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ ఉద్యోగ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురాగా, ఆయా ఉద్యోగాలు పొందిన బాలికలు మిగిలినవారికి మార్గదర్శులుగా మారారు.
చట్టం ఏం చెబుతోంది..?
భారతీయ వివాహ చట్టం 1955 ప్రకారం ఆడపిల్లకు 18 ఏళ్లు దాటిన తర్వాత, అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా వివాహ వయస్సు ఉండాలని 2006లో భారతీయ వివాహ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ మార్పుచేసింది. ఫలితంగా ఇప్పుడు అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా కాదని బాల్య వివాహాలు నిర్వహిస్తే రెండు కుటుంబాలపైన చట్టపరమైన చర్యలు తప్పవు. గత పదేళ్లలో జిల్లాలో 1120 బాల్య వివాహాల ఫిర్యాదులు నమోదు కాగా, ఇందులో 1112 పెళ్లిళ్లను అధికారులు నిలుపుదల చేసి, ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొండికేసి బలవంతంగా పెళ్లి జరిపిన 8 కుటుంబాలపై కఠిన చర్యలు చేపట్టారు.
అవగాహన పెరిగింది
బాల్య వివాహాలు చేయకూడదనే విషయం ప్రజలకు తెలిసింది. ప్రతి రోజు మేం చేస్తున్న కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రధానంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయే పరిస్థితి కూడా ఉంది. వీటిపై ప్రజల్లో అవగాహన రావడంతో బాల్య వివాహాలు తగ్గాయి. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, విద్యావకాశాలు మెరుగుపర్చడం వంటి వాటి ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి.
– కేవీ రమణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment