కేజ్రీవాల్‌పై.. రంగు పడింది!
రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బికనీర్‌లో ఇంకు దాడి జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో శంకర్ సేవాదాస్ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో దినేష్ ఓఝా అనే యువకుడు కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అని ఆరోపిస్తూ బయటి నుంచి ఆయన ముఖంపై ఇంకు పోసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏబీవీపీకి చెందిన విద్యార్థి నాయకుడైన ఓఝాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం.. దానిపై ట్విట్టర్లో స్పందిస్తూ.. తన మీద ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. వాళ్లు బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇంతకుముందు జనవరి నెలలో కూడా కేజ్రీవాల్ మీద ఒకసారి ఇంకు దాడి జరిగింది. అప్పట్లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన బృందానికి చెందిన ఒక మహిళ ఆయనపై ఇంకుపోసింది. ఆ సమయంలో.. ముఖ్యమంత్రి భద్రతను ఢిల్లీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. ఆ మహిళను అరెస్టు చేయకపోగా.. ఆమె మీడియాకు ప్రకటనలు కూడా ఇస్తోందని చెబుతూ, ఇదంతా బీజేపీ కుట్ర అని కూడా అప్పట్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు.
Hmmm... God bless those who threw ink at me. I wish them well.
— Arvind Kejriwal (@ArvindKejriwal) 4 October 2016