వికటించిన రైలు భోజనం.. ప్రయాణికుల నిరసన
మామూలుగా రైల్లో భోజనం అంటే ఓ మాదిరిగా ఉంటుంది. అదే రాజధాని, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లయితే బాగుంటుంది. కానీ, న్యూఢిల్లీ నుంచి సీల్డా వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో భోజనం తిన్న ఆరుగురు ప్రయాణికులు అనారోగ్యం పాలయ్యారు. దాంతో ప్రయాణికులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్లో భోజనంతో పాటు సేవల నాణ్యత కూడా అత్యంత ఘోరంగా ఉంటుందిన కేంద్ర మంత్రి, ఆసన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో ఆహారం బాగోకపోవడంతో పాటు సేవల నాణ్యత కూడా ఘోరంగా ఉందంటూ ఆసన్సోల్, సీల్డా స్టేషన్లలో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఒక రైల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టేటప్పుడు అందులో సేవల నాణ్యత బాగుండాలని ఆశిస్తామని, కానీ ఈ రైల్లో అలా లేదని ఓ మహిళా ప్రయాణికురాలు అన్నారు. తాము ప్రయాణించిన రైల్లో ఆరుగురు భోజనం తిన్న తర్వాత అనారోగ్యం పాలయ్యారని మరో ప్రయాణికురాలు చెప్పారు. రాజధాని రైలు ఆహారం, సేవలపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తూర్పు రైల్వే అధికారులు తెలిపారు. రైల్లో సుమారు 1200 మంది ప్రయాణికులున్నారని, వాళ్లలో కేవలం ఐదారుగురు మాత్రమే ఇబ్బంది పడ్డారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాజధాని రైలు ఆహారం నాణ్యత విషయాన్ని తాను రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చిస్తానని, తాను కూడా స్వయంగా ఒకసారి ఆసన్సోల్ వచ్చి పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు.