గోవధపై గాంధీజీ అవగాహన ఏమిటి?
గోవు, గోవధ, గోమాంస భక్షణ విషయాలపై జాతిపిత కన్నా పవిత్రులుగా భావించుకునే వారికి తప్ప మిగిలిన వారికి చక్కగా అర్థమయ్యేలా ఉన్న మహాత్ముని మాటలు, ఈ సంక్షోభ సమయంలో దిశానిర్దేశం చేస్తాయన్న విశ్వాసంతో వాటి తెలుగు అనువాదం అందిస్తున్నాం. రాజేంద్రబాబు నాతో చెప్తున్నారు, తనకు 50 వేల పోస్టుకార్డులు, 25 నుంచి 30 వేల మధ్య ఉత్త రాలు, వేలాది టెలిగ్రామ్‌లు గోవధ నిషేధం కోరుతూ వచ్చాయని. నేను మీతో ఈ సంగతి ఇంత కుముందర కూడా మాట్లాడాను. ఇప్పుడీ ఉత్తరాల, టెలిగ్రాముల వరద దేనికి? వాటికి ఏ ప్రభావమూ ఉండదు.
నాకు ఇంకో టెలిగ్రామ్ కూడా వచ్చింది, ఒక మిత్రుడైతే, ఈ నిషేధం కోరుతూ నిరాహార దీక్షకు ఉపక్రమించాడని. భారతదేశంలో గోవధ నిషేధాన్ని విధిస్తూ ఏ చట్టమూ చేయలేము. హిందు వులకు గోవధ నిషిద్ధమని ఎరుగుదును. నేను కూడా గోసేవకు చాలా కాలం నుంచి కంకణం కట్టుకు న్నాను. అయినా, ఈ దేశంలో నా మతం, మిగిలిన భారతీయుల మతం ఎలా అవుతుంది? అలా చేయడం హిందువులు కాని వారిని బలవంతాన మార్చినట్టు.
మనం, ‘మతం విషయంలో ఎలాంటి బలవంతం ఉండదు, చేయము’ అని ఇంటి కప్పులకెక్కి అరుస్తున్నాం. మనం ప్రార్థన లలో ఖురాన్ నుంచి దివ్య చర ణాలు చదువుతున్నాం. అయితే, ఎవరైనా నన్ను ఈ చరణాలు చద వమని బలవంతం చేస్తే, నాకు ఇష్టం ఉండదు. వారంతట వారే గోవులను చంపరాదు అని అను కోకపోతే, నేను వారిచేత గోవధ ఎలా మాన్పించ గలను? ఈ సమైక్య భారతదేశం (ఇండియన్ యూనియన్)లో, హిందువులు మాత్రమే లేరు. ముస్లింలు, పార్శీలు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారు కూడా ఉన్నారు.
హిందువులు ఇప్పుడు ఈ భారతదేశం కేవలం వారికే చెందుతుందనుకోవడం తప్పు. భారతదేశం ఇక్కడ నివసించే వారందరిదీ. ఇక్కడ మనం గోవధ నిషేధ చట్టం చేస్తే, సరిగ్గా దానికి వ్యతిరేకం అయి నదే అక్కడ పాకిస్తాన్లో జరిగితే, దాని వల్ల ఒనగూరే ఫలితం ఏమిటి? ఒకవేళ వారు షరియత్ ప్రకారం విగ్రహారాధన కూడదు కనుక, హిందువులను ఆలయా లకు వెళ్లనివ్వం అన్నారే అనుకోండి. ప్రతి రాతిలో పరమా త్మను చూసే నేను, నా ఈ విశ్వా సం వల్ల ఇతరులకు ఎలా చేటు చేయగలను? ఒకవేళ నన్ను ఆల యాలకు వెళ్లవద్దు అని నిరోధించినా నేను ఎలాగో ఆ పరమాత్మను చూస్తాను. అందువల్ల, నా సలహా ఏమిటంటే ఈ ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు ఆగిపోవాలి. వాటిపై ధనం ఖర్చు చేయడం సరైన పని కాదు.
అంతేకాక కొందరు ధనవంతులైన హిందువులే గోవధను ప్రోత్సహించడం ఉన్నది. నిజమే ఈ పని వారు వారి స్వహస్తాలతో చేయరు. కానీ, ఎవరు ఇంత అధిక సంఖ్యలో గోవులను అమెరికా, ఇతర దేశాల వధ్య కేంద్రాలకు పంపిస్తున్నారు? వాటి చర్మంతో తయారైన చెప్పులు తిరిగి ఈ దేశానికి దిగుమతులు చేస్తున్నారు? నాకొక సదాచారపరా యణుడైన వైష్ణవుడు తెలుసు. ఆయన తన బిడ్డలకు బీఫ్ సూప్ తాగించేవాడు. ఎందుకలా చేస్తున్నారని నేను తనను అడిగాను, ఆవు మాంసం మందుగా తీసుకుంటే తప్పులేదని చెప్పారు.
మనం నిజానికి ఏది అసలైన ధర్మావలంబన అని ఆలోచించకుండా ‘గోవధ నిషేధం’ అంటూ అరుస్తూ వీధులమ్మట హడావుడి చేస్తాం. పల్లెల మ్మట హిందువులైన చిన్నా, పెద్దా, రైతులు, భూస్వా ములు ఎడ్లపై, ప్రతిరోజూ మోయలేని భారాలు మోపి, వాటి జీవితాంతం అవి నెమ్మది నెమ్మదిగా చచ్చిపోయేలా, భరించలేని బరువులు మోయి స్తారు. అది నెమ్మదిగా జరిపిన గోవధ కాదా? అందుకే నేను సూచిస్తున్నాను, ఈ అంశం రాజ్యాంగ సభలో ప్రస్తావించకుండా ఉంటే బాగుంటుంది. (జూలై 25, 1947న మహాత్ముడు ఇచ్చిన సందేశంలో భాగమిది. మహాత్మాగాంధీ సంకలిత రచ నలు, 88వ వాల్యూమ్‌లో గాంధీ హెరిటేజ్ పోర్టల్‌లో లభ్యం. ప్రార్థన ప్రవచన-పేజీలు: 277-280.)
- తెలుగు అనువాదం
రామతీర్థ, మొబైల్: 98492 00385