Rajeshwar Tiwari
-
హరితహారం సంతృప్తినిచ్చింది
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్‌గా 36 ఏళ్ల పాటు వివిధ శాఖల్లో పనిచేయడంతో పాటుగా ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజేశ్వర్ తివారీ శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా అరణ్యభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా తివారి మాట్లాడుతూ.. హరితహారం రూపకల్పనలో భాగస్వామ్యం కావడం తన సర్వీసులో అత్యంత సంతృప్తినిచ్చిన విషయమని చెప్పారు. హరితహారం కార్యక్రమం ఐదేళ్లుగా విజయవంతంగా అమలు కావటం తన సర్వీస్ మొత్తంలో సంతోషాన్ని ఇచ్చిన విషయమని చెప్పారు. తివారీతో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా కర్నూలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన తివారీ, ప్రభుత్వంలో రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటి పారుదల, విద్యుత్ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఎఫ్.డీ.సీ ఎం.డి రఘువీర్, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెద్ద మొక్కలు అందుబాటులో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా నాటేందుకు వీలైనంత పెద్ద మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆదేశించారు. ఇప్పటికే నాటిన మొక్కలు చనిపోయిన చోట్ల పెద్ద మొక్కలతో వెంటనే మార్పు చేయించాలని, ఈ విషయంలో నోడల్ అధికారుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని, వారే బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో రెండో విడత పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అరణ్య భవన్లో తెలంగాణకు హరితహారం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్యయ కమిటీ సమావేశంలో హరితహారం అమలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. మొదటి విడత పల్లె ప్రగతి జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితిని జిల్లాల వారీగా అధికారులు ఆరాతీశారు. నాటిన మొక్కలు బతికిన శాతం, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, రానున్న రోజుల్లో నీటి సౌకర్యం, రక్షణ చర్యలు, రానున్న సీజన్లో నాటాల్సిన మొక్కల కోసం నర్సరీల్లో ఏర్పాట్లపై చర్చించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రస్తుతం గ్రీనరీ బాగుందని, మరింతగా పచ్చదనం ఔటర్ చుట్టూ పెరిగేలా హెచ్ఎండీఏ దృష్టి పెట్టాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, అదనపు పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్‌తో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మా సొమ్ములివ్వండి మహాప్రభో..!
సాక్షి, హైదరాబాద్ : దరఖాస్తులు తిరస్కరించి నాలుగేళ్లయినా.. చెల్లించిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జీఓ 58,59ను జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు జీఓ 58 కింద ఉచితంగా స్థలాలను క్రమబద్ధీకరించిన సర్కారు..జీఓ 59 కింద (చెల్లింపు కేటగిరీ)మాత్రం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించిన వారికి స్థల యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే, జీఓ 59 కింద అనర్హమైన దరఖాస్తుదారుల డబ్బులను రిఫండ్ చేయకుండా మొండికేసింది. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు డబ్బును వాపసు చేయమని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అర్జీలు స్వీకరించిన సమయంలో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తుదారులు నిర్దేశిత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఈ నిధులను కొన్నాళ్లు తమ ఖాతాల్లోనే ఉంచుకున్న తహసీల్దార్లు.. ఏ పద్దు కింద వీటిని డిపాజిట్ చేయాలో తెలియక స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు అట్టిపెట్టుకోవడం సరికాదని భావించిన ప్రభుత్వం.. ఆ నిధులను ట్రెజరీల్లో జమ చేయాలని ఆదేశించింది. మూలుగుతున్న రూ.48.56 కోట్లు చెల్లింపు కేటగిరీ కింద స్థలాల క్రమబద్ధీకరణ చేసుకున్న అర్జీలలో 2,761 దరఖాస్తులను ప్రభుత్వం తోసిపుచ్చింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేనివాటిని, రైల్వే, కాందిశీకులు, తదితర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన కట్టడాల రెగ్యులరైజ్‌కు చేసుకున్నవాటిని అనర్హమైనవి తేల్చింది. ఈ మేరకు తిరస్కరణ గురైన దరఖాస్తుదారులకు చెల్లించిన మొత్తాన్ని వాపస్ చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, మెదక్, జోగులాంబ–గద్వాల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.48.56 కోట్లు ఇవ్వాల్సివుంటుందని లెక్క గట్టింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో నిరాశకు గురైన అర్జీదారులు కనీసం చెల్లించిన మొత్తమైనా వస్తుందని భావించి తహసీళ్ల చుట్టూ చక్కర్లు కొట్టారు. దరఖాస్తుదారులు కట్టిన మొత్తాన్ని ట్రెజరీల్లో జమ చేసినందున.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్పా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తుదారుల ఆవేదనను ఆర్థం చేసుకున్న కలెక్టర్లు రిఫండ్ విషయాన్ని తేల్చాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. డబ్బును వాపస్ చేయమంటూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఏ పద్దు కింద ట్రెజరీ నుంచి తిరిగి తీసుకోవాలనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆఖరికి ఈ వ్యవహారంపై స్పష్టతనిస్తూ గతేడాది మే 18న జీఓ 206 జారీ చేసినా.. కలెక్టర్లు ఇప్పటివరకు దరఖాస్తుదారులకు నయాపైసా వెనక్కి ఇవ్వలేదు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు చక్కర్లు కొడుతున్నా.. రెవెన్యూ గణం మాత్రం కనికరించడంలేదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. కలెక్టర్లు మాత్రం స్పందించకోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
కార్బైడ్ వాడితే.. ఆరునెలల జైలు
హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్థాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కృత్రిమంగా మగ్గ పెట్టిన పండ్లను తినడం ద్వారా కాన్సర్‌తో పాటు జీర్ణ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర ప్రచార సామగ్రి సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తోందని తెలిపారు. ఆరుగురు వ్యాపారులు సొంతంగా ఇథిలీన్ ఛాంబర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారని.. మార్చి ఆఖరులోగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రై వేటు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఇథిలీన్ ఛాంబర్లు వుండగా.. అవసరమైన చోట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. -
‘గురుకుల’ సొసైటీ విభజనకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ విభజనకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జీవో జారీచేశారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ ఏర్పాటు కానున్నాయి. కాగా, నకిలీ మెడికల్ బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేసిన దాదాపు వందమంది టీచర్లపై చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఆ కేసులు నడుస్తుండగానే కొత్తగా మరో వంద మందిపై చర్యలు చేపట్టింది. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ. 2లక్షల వరకు కాజేసినట్లు తేలింది.