నడిగర్ గౌరవ సలహాదారులుగా కమల్, రజనీ ?
చెన్నై : ఈ నెల 18న జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్ జట్టుపై విశాల్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, ఉపాధ్యక్షులుగా కరుణాస్, పొన్‌వన్నన్‌లు, కోశాధికారిగా కార్తీ గెలిచారు. కార్యవర్గ సభ్యులుగా రాజేష్, ప్రసన్న, పశుపతి, జూనియర్ బాల య్య, నందా, రమణ, శ్రీమాన్, సంగీత, కుట్టి పద్మిని, కోవైసరళ, శరత్ గెలిచారు.
శరత్‌కుమార్ జట్టులో కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసిన వారిలో నళిని, రాంకీ, నిరోషా, టీపీ గజేంద్రన్ గెలుపొందారు. వీళ్లంతా నూతన కార్యవర్గంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. 25 వ తేదీన నూతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సంఘం భవన నిర్మాణం గురించి, ఇంతకు ముం దు ఒప్పందం రద్దు గురించి శరత్‌కుమార్ పత్రికా సమావేశంలో ప్రకటించిన వ్యవహారం గురించి చర్చించనున్నట్టు సమాచారం.
అదే విధంగా సంఘానికి కమలహాసన్, రజనీకాంత్‌లను గౌరవ సలహాదారు పదవులను అందించే విషయం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలోనే సంఘం సర్వసభ్య సమావేశం తేదీని నిర్ణయించనున్నట్లు సమాచారం.