నోబెల్ మెమోరియల్ వాల్ ప్రారంభం
న్యూఢిల్లీ: నగరంలోని రాజీవ్ మెట్రో రైల్ స్టేషన్లో ఆదివారం ఉదయం నోబెల్ మెమోరియల్ వాల్‌ను స్వీడన్ రాయబార కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) , కెనడా రాయబార కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భారతదుశం నుంచి నోబెల్ పురస్కారాలను అందుకున్న వారి గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించామని డీఎంఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.
నోబెల్ మెమోరియల్ వాల్ ప్రదర్శన ఆదివారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీదాకా జరగనుంది. ఈ ప్రదర్శనలో భాగంగా ఈ గోడపై రవీంద్రనాథ్ ఠాగూర్, సీవీరామన్, సుబ్రమణ్య చంద్రశేఖర్, డాక్టర్ హరగోవింద్ ఖురానా, మదర్‌థెరిస్సా, అమర్త్యసేన్, వెంకట్రామన్ రామకృష్ణన్లతోపాటు ఈ ఏడాది నోబెల్ బహుమతి విజేత కైలాష్ సత్యార్థి ఫొటోలను కూడా ఉంచనున్నారు. ఈ వాల్ ప్రారంభ కార్యక్రమంలో డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్, స్వీడన్ రాయబారి హెరాల్డ్ శాండ్‌బర్గ్, నార్వే రాయబారి ఇవిండ్ ఎస్ హొమ్మే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ మాట్లాడుతూ నోబెల్ మెమోరియల్ వాల్ ప్రార ంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. నోబెల్ పురస్కార గ్రహీతలవల్ల భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు.