విద్యార్థులకు నేటి నుంచి రేడియో పాఠాలు
చాగల్లు : ప్రభుత్వ పాఠశాలల్లో మీనా ప్రపంచం, విందాం, నేర్చుకుందాం అనే రేడియో ప్రసార కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆకాశవాణి ద్వారా విద్యార్థుల కోసం రాజీవ్ విద్యామిషన్ రేడియో పాఠాల కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించింది. దీనికోసం పాఠశాలలకు అప్పట్లో రేడియోలను పంపిణీ చేశారు. ఈ పాఠాల్లో కథల రూపంలో బాలల హక్కులు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. మంచి అలవాట్లు, చక్కని కథలు, బుజ్జి ప్రశ్నలు, పాఠ్యాంశాలతో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడమే రేడియో పాఠాల ప్రధాన లక్ష్యం. ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు రేడియో కార్యక్రమాల ప్రసారాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతానికి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి విందాం, నేర్చుకుందా కార్యక్రమాల షెడ్యూల్ను ఇచ్చారు. మిగిలిన 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి షెడ్యూల్, మీనా ప్రపంచం కార్యక్రమాల షెడ్యూల్ను పాఠశాలలకు ఇవ్వాల్సి ఉంది.
విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11.15 గంటల నుంచి 11.45 వరకు రేడియో కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పడతాయి. బట్టీ విధానానికి స్వస్తిపలికి అన్వేషణలు, విశ్లేషణలు, ఆలోచించే విధానం అలవడుతుంది. తరగతి గదిలో బోధించని పలు అంశాలను ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు.
మూలకు చేరిన రేడియోలు
రాజీవ్ విద్యామిషన్ ద్వారా గతేడాది చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రసార సేవలు సరిగా అందకపోవడంతోపాటు అనేక పాఠశాలల్లో రేడియోలు పాడై మూలకు చేరాయి. వీటిపై పాఠశాల హెచ్ఎంలు దృష్టి సారించడం లేదు. కొన్నిచోట్ల రేడియోలు పనిచేస్తున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. రేడియోల ద్వారా పాఠాలు విద్యార్థులకు చేరేలా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.