అప్పాజీ విగ్రహానికి నిప్పు
బెంగళూరు : స్థానిక రాజరాజేశ్వరి నగరలో కన్నడ కంఠీరవుడు, పద్మభూషణ్ డాక్టర్ రాజ్‌కుమార్ (అప్పాజీ) విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను పట్టుకోడానికి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి గురువారం మీడియాకు చెప్పారు.
ఆయన తెలిపిన వివరాల మేరకు..
ఇక్కడి రాజరాజేశ్వరి నగరలోని బంగారప్ప లేఔట్ దగ్గర ఉన్న గుడ్డేలో రాజ్‌కుమార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. గుడ్డే సమీపంలో గ్రానైట్‌తో పెద్ద దిమ్మె ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘సిపాయి రాము’ సినిమాలోని స్టిల్‌ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్‌తో విగ్రహం తయారు చేయించారు. బుధవారం ఆ విగ్రహం తీసుకువచ్చారు. ఈ నెల 23వ తేదీన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం వేకువ జామున గుర్తు తెలియన అల్లరిమూకలు రాజ్‌కుమార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కర్ణాటక రక్షణా వేదిక, జయ కర్ణాటక రాజ్ కుమార్ అభిమానుల సంఘం, అఖిల కర్ణాటక రాజ్‌కుమార్ అభిమానుల సంఘంతో పాటు వివిధ సంఘాలు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు.
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి, నగర అడిషనల్ పోలీసు కమిషనర్లు అలోక్‌కుమార్, దయానంద్, డీసీపీలు లాబురామ్, అభిషేక్ గోయల్ తదితరుల సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ముందు జాగ్రత చర్యగా ముగ్గురు డీసీపీలు, ఐదు మంది ఏసీపీలు, 10 మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్లు, రెండు కేఎస్ఆర్పీ బెటాలియన్లను సంఘటన స్థలంలో భద్రత కోసం నియమించారు.
నిరసన
కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ, అఖిల కర్ణాటక డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, జయ కర్ణాటక సంఘం నాయకులతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తూ.. నిందితులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అదే విధంగా కన్నడ సినీ రంగానికి చెందిన రెబల్‌స్టార్ అంబరీష్, డాక్టర్ భారతీ విష్ణువర్దన్, లీలావతి, జయంతి, జయమాల, పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఈగ ఫేం సుదీప్ తదితరులు ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. కన్నడ సినీ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.