రాజ్‌నాథ్ నివాసం ఎదుట ఆప్ ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం జరిగిన అత్యాచార ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసం ఎదుట సోమవారం ఉదయం ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిలోనే మహిళలకు రక్షణ లేని దుస్థితి అంటూ దుమ్మెత్తిపోశారు.
మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ఢిల్లీలో మహిళల రక్షణ కోసం భద్రతా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు వందమంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో 25 ఏళ్ల యువతి అర్ధరాత్రి అత్యాచారానికి గురైంది.
గమ్యస్థానంలో దిగబెడతానని చెప్పి క్యాబ్ డ్రైవర్ శివకుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు... నిందితుడ్ని మధురాలో అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. నిందితుడు 2011లోనూ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిసింది. బెయిల్‌పై బయటకొచ్చి క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.