Rajugari Gadi 2
-
నాగార్జునతో నటించడం అదృష్టం
మహానంది: రాజుగారి గది–2లో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని యువ హీరో అశ్విన్‌బాబు అన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మిత్రులతో కలిసి సోమవారం ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా అశ్విన్‌బాబు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి చిత్రం జీనియస్ కాగా ఆ తర్వాత రాజుగారి గది, జతకలిసే, నాన్న..నేను నా బాయ్‌ఫ్రెండ్, రాజుగారి గది–2 చిత్రాల్లో నటించానన్నారు. త్వరలో మరో మూడు ప్రాజెక్టులు చేయబోతున్నట్లు చెప్పారు. -
అమ్మో సమంత కల్లోకి రావొద్దు....
అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల్ని తొలి సినిమాతోనే మాయ చేసిన సమంత నిన్న మొన్నటి వరకూ చాలామంది డ్రీమ్‌గాళ్. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తమ కల్లోకి రావొద్దని చాలా మంది కోరుకుంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... శుక్రవారం విడుదలైన రాజుగారి గది 2లో సమంత నటన సూపర్బ్ అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో సామ్ యాక్షన్ అదుర్స్ అంటూ ట్విట్టర్లో కామెంట్స్ వస్తున్నాయి. ఇదే విషయాన్ని రంగస్థలం టీమ్ కూడా ఇదే విషయాన్ని ట్విట్ చేసింది. @Samanthaprabhu2 Till now u mi8 have been a dream girl for many. Now after #RajuGariGadhi2 most ppl do not want u in their dreams. — రంగస్థలం 1985 🌅 (@AkkuZoomin) 13 October 2017 చాలామంది ఇప్పటివరకూ సమంతను డ్రీమ్‌గాళ్‌గా చూశారని, అయితే రాజుగారి గది 2 సినిమా చూశాక వాళ్లంతా తమ కల్లోకి సమంత రావొద్దని అనుకుంటారని పేర్కొంది. కాగా రంగస్థలం చిత్రంలో హీరో రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత తన నటనకు ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ చిత్రంలో అమృత పాత్రలో నటించిన ఆమె తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆమె నటనపై ట్విట్టర్లో పొగడ్తల వర్షం కురుస్తోంది. సుమంత ఇంటి పేరు మారినా ఆమె సక్సెస్‌లో విజయపరంపర కొనసాగుతోందని అభిమానులు వ్యాఖ్యలు చేశారు. సమంత పెళ్లి తర్వాత విడుదలైన తొలి సినిమాతో హిట్ సొంతం చేసుకుందని అభినందించారు. అలాగే మామాకోడళ్లు సమంత నాగార్జున కాంబినేషన్ సీన్స్ లో ఇద్దరు పోటాపోటీగా ఇరగదీశారంటూ కామెంట్స్ పెట్టారు. -
ఓంకార్‌కి ఓ దండం పెట్టా: నాగార్జున
సాక్షి, హైదరాబాద్ : రాజుగారి గది-2 సినిమా బాగా వచ్చిందని, క్లైమాక్స్‌లో సమంత నటన సూపర్ అని అక్కినేని నాగార్జున ప్రశంసించారు. నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెంటలిస్ట్ పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..రాజుగారి గది-2 సినిమా తనకు చాలా స్పెషల్ అని అన్నారు. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పెళ్లి అయిన తర్వాత కోడలు సమంత ఒక హిట్ తీసుకొచ్చిందని అనుకునేలా ఉండాలి. అది తప్పకుండా వస్తుందని గొప్ప నమ్మకం. సినిమా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడల్లా చెబుతుంటాను... అలాగే మళ్లీ వస్తున్నాం... మళ్లీ హిట్ కొడుతున్నాం. ఇక దర్శకుడు ఓంకార్‌కు ఓసీడీ ఉంది. సినిమా మీద అతడికి విపరీతమైన ప్రేమ. అనుకున్నది కరెక్ట్‌గా వచ్చేవరకూ అందర్ని చంపాడు. నేను సాధారణంగా ఎప్పుడు చిరాకు పడను. అలాంటిది నేను కూడా అతడి మీద చిరాకుపడ్డాను. చివరి రోజు షూటింగ్ అయిపోయాక నీకో దండం అయ్యా బాబు అని...ఓంకార్‌కు చెప్పాను. చిత్ర యూనిట్ అంతా ఓ టీమ్‌గా పనిచేసింది. ఆ శ్రమకు తగిన ఫలితం సినిమా రిలీజ్ అయిన తర్వాత కనిపిస్తుంది’ అని నాగార్జున అన్నారు. -
నేను కెప్టెన్... నాగార్జునగారు కోచ్!
‘‘సిన్మాలో ఎంతమంది ఆర్టిస్టులున్నా... థియేటర్ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకులకు గుర్తుండేది నాగార్జునగారు, సమంతలే. వాళ్లిద్దరి పాత్రలు సిన్మాకి హైలైట్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మామాకోడళ్లు తమ నటనతో చంపేశారంతే!’’ అన్నారు ఓంకార్. నాగార్జున హీరోగా ఆయన దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన ‘రాజుగారి గది–2’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన సంగతులు... ► ‘రాజుగారి గది’ తర్వాత ఆ సిన్మాకి సీక్వెల్ స్టోరీ ఒకటి, ఫ్యామిలీ స్టోరీ మరొకటి రెడీ చేశా. వెంకటేశ్‌గారికి ‘రాజుగారి గది’ సీక్వెల్ కథ చెప్పా. అయితే... అదీ, ఇప్పుడీ సిన్మా కథ ఒక్కటి కాదు. వెంకీగారు ‘గురు’తో బిజీ. ఈలోపు నా స్నేహితులు వంశీ–శేఖర్ ద్వారా నిర్మాత పీవీపీగారిని కలిశా. ఆయనే సీక్వెల్ తీద్దామని, ఓ రోజు మలయాళ ‘ప్రేతమ్’ ట్రైలర్ లింక్ పంపించారు. అందులో ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేస్తే ఆడదని చెప్పి, ‘ప్రేతమ్’లో మూలకథ తీసుకుని కొత్త కథ రాశా. ► పీవీపీ, మ్యాట్నీ సంస్థల పేరునీ, ‘రాజుగారి గది’కి వచ్చిన ఇమేజ్‌నీ దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేశా. కథ విన్న ‘మ్యాట్నీ’ నిరంజన్‌రెడ్డిగారు మెంటలిస్ట్ పాత్రకు నాగార్జునగారు, ఆత్మ పాత్రకు సమంత అయితే బాగుంటుం దన్నారు. నాగ్ సార్ కథ విన్న ఐదు నిమిషాల్లో ‘ఓకే’ చేసేశారు. సమంత కూడా కథ విన్న వెంటనే ‘ఐయామ్ డూయింగ్ దిస్’ అన్నారు. ► ‘బౌండ్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా వచ్చేవరకు సలహాలు ఇస్తా. షూటింగ్ స్టార్ట్ అయ్యాక యు ఆర్ మై బాస్’ అన్నారు నాగ్ సర్. ఓ స్టార్ హీరోతో నేను వర్క్ చేయడం ఇదే మొదటిసారి. ఆయన అన్నట్లుగానే దర్శకుడిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఎన్ని టేక్స్ అడిగినా చేశారు. మంచి సీన్స్, సిన్మా కోసం కొన్ని రీటేక్స్ తప్పలేదు. ‘బొమ్మరిల్లు’ క్లైమాక్స్ తర్వాత... మళ్లీ మాటల రచయిత అబ్బూరి రవికి అంత పేరు తీసుకొచ్చే క్లైమాక్స్నీ, మాటల్నీ ఇందులో రాశారు. ► ఇటీవల ఇంటర్వ్యూలో ‘ముంబైలో వద్దు, హైదరాబాద్‌లోనే గ్రాఫిక్స్ చేయిద్దామంటే, మీరు ముంబై కంపెనీకే గ్రాఫిక్స్ వర్క్ అప్పగించారని... దర్శకులు టైమ్‌సెన్స్ తెలుసుకోవాలి’ అని నాగార్జున చేసిన వ్యాఖ్యలను ఓంకార్ వద్ద ప్రస్తావించగా... ‘‘నాగార్జునగారిది 30 ఏళ్ల అనుభవం. నాకిది మూడో చిత్రమే. ఈ సిన్మాకి నేను కెప్టెన్ అయితే... ఆయనే మా కోచ్. మంచి క్వాలిటీ కోసమే ముంబై కంపెనీతో గ్రాఫిక్స్ వర్క్ చేయించాం. అవుట్‌పుట్ చూసి, ఆయన హ్యాపీ ఫీలయ్యారు. నాగ్ సార్ మాటల్ని ఆశీర్వాదాలుగానే తీసుకున్నా. ఐయామ్ ఎ పాజిటివ్ పర్సన్. నెగిటివ్‌గా ఆలోచిస్తే... ముందుకు వెళ్లలేం’’ అన్నారు. ► ‘సమంత ఆత్మగా నటించారని నాగచైతన్య సినిమా చూడనన్నారట!’ అని ఓంకార్‌ని అడగ్గా... ‘‘అఖిల్ కూడా చూడనని చెప్పారట! రిలీజయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ చూసి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. -
అదొక్కటే చాలదు!
తమిళసినిమా: నటి సమంతకు పెళ్లి కళ వచ్చేసింది. అక్టోబర్ ఆరో తేదీన కోరుకున్న ప్రియుడు (నాగచైతన్య)ను పెళ్లాడబోతున్నారు. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్న ఈ చెన్నై చిన్నది క్రిష్టియన్ మత సంప్రదాయం ప్రకారం ఒక సారి, ప్రియుడి మతం హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి అంటూ రెండుసార్లు పెళ్లి, ముచ్చటగా మూడోసారి వివాహ రిసెప్షన్ అంటూ మూడు సార్లు ముస్తాబవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే తన పెళ్లికి స్పెషల్ దుస్తులు సిద్ధం చేసుకున్న సమంత మరో పక్క తను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసే పనిలో బీజీగా ఉన్నారు. విశేషం ఏమిటంటే తన పెళ్లి తరుణంలో తనకు కాబోయే మామగారు నాగార్జునతో కలిసి రాజుగారి గది–2 చిత్రంలో నటించడం. అదే విధంగా తాను విజయ్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం మెర్శల్ తన పెళ్లి సందర్భంలోనే తెరపైకి రానుంది. ఇకపోతే ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సమంత తానేమంత అందగత్తెను కాదని బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా ఈ బ్యూటీ తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ నిజానికి తాను అందంగా ఉండాలని మాత్రమే కోరుకోనన్నారు. అందంతో పాటు స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటానన్నారు. అందుకోసమే సిలంబాట్టం(విలువిద్య) నేర్చుకున్నానని నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పారు. ఇక వేకువజామునే షూటింగ్ ఉన్నా అంతకు ముందే జిమ్‌కు వెళ్లి ఆ రోజు చేయాల్సిన కసరత్తులు ముగిస్తానన్నారు. ఆకలితో ఉండడం, ఉపవాసాలు చేయడం వంటివి తనకు అలవా టు లేదన్నారు. ప్రొటీనులు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటానని, ఫ్రెష్ జ్యూస్, కొబ్బరి నీళ్లు తరచూ తాగుతానని చెప్పారు. పోషకాహారాలే మేనును మిలమిల మెరిసేలా చేస్తాయని సమంత పేర్కొన్నారు. -
ఏది ఎక్కువ ఏది తక్కువ!
సమంతలో కూసింత కామెడీ పాళ్లు ఎక్కువనే చెప్పుకోవాలి. సినిమా వేడుకల్లో స్పాంటేనియస్‌గా స్పందించే సమంత, సోషల్ మీడియాలో ఎవరైనా చికాకు పుట్టించే ప్రశ్నలు వేసినా... భలే సరదా సమాధానాలు ఇస్తుంటారు. అటువంటి సమంత సడన్‌గా తత్వవేత్తగా మారారు. ప్రేక్షకులతో పాటు ప్రజలకు ఫిలాసఫీ పాఠాలు చెబుతున్నారు. ‘‘నువ్వు చూపించే దానికంటే (టాలెంట్) నీ దగ్గర ఎక్కువ ఉండాలి. నీకు తెలిసిన దానికంటే నువ్వు తక్కువ మాట్లాడాలి’’ అన్నారామె. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు... సినిమా రంగంలో జయాపజయాలు సహజమే. రియల్ లైఫ్, రీల్ లైఫ్... రెండిటిలోనూ సమంత సక్సెస్ఫుల్ లేడీ. అటువంటి ఆమె ఇప్పుడీ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక కారణం ఏంటని అభిమానులు ఆలోచిస్తున్నారు. అన్నట్టు, త్వరలో నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న ఈ చెన్నై సుందరి కాబోయే మామగారు నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో కీలక పాత్ర చేస్తున్నారు. -
నా లెక్క వేరే ఉంది : నాగార్జున
సీనియర్ స్టార్లలో ఫుల్ ఫాంలో ఉన్న హీరో కింగ్ నాగార్జున. ఇప్పటికీ రొమాంటిక్ హీరో పాత్రలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా సై అంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. త్వరలో మరోసారి భక్తుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగ్. ఇది నాగ్ తెర మీద కనిపిస్తున్న 98వ సినిమా. ఈ 98 చిత్రాల్లో కొన్ని నాగ్ అతిథి పాత్రల్లో కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా తరువాత నాగ్ చేయబోయే రెండు సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 2' సినిమా ఇప్పటికే ప్రారంభం కాగా.. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాకు ఓకె చెప్పాడు. ఇదే నాగ్ నటించే వందో సినిమా. దీంతో అభిమానులు బంగార్రాజు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ నాగ్ మాత్రం బంగార్రాజు తన వందో సినిమా కాదని చెపుతున్నాడు. తాను అతిథి పాత్రల్లో నటించిన సినిమాలు తన లెక్కలోకి రావని.. అందుకే తన వందో సినిమా విషయంలో తన లెక్కవేరని చెపుతున్నాడు. త్వరలోనే ఆ లెక్క అభిమానులకు చెప్తానంటున్న కింగ్.. వందో సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలు తమ మైల్ స్టోన్ చిత్రాలను భారీగా అభిమానుల ముందుకు తీసుకురాగా.. నాగ్ మూవీ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు ఎదురుచూస్తున్నారు.