రాజులదేవర మూలవిరాట్ కోసం ఘర్షణ
కుందుర్పి : రాజుల దేవర స్వామి మూలవిరాట్ తమదంటే తమదని మలయనూరు, వడ్డెపాళ్యం గ్రామస్తులు శనివారం తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. వివరాలు..వందేళ్ల క్రితం వడ్డెపాళ్యంలో రాజులదేవర స్వామిని ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. అయితే ప్రతి ఏటా ఉగాది పర్వదినాల్లో స్వామివారిని మలయనూరుకు తీసుకువెళ్లి అక్కడున్న ఓబుళదేవర స్వామి, మల్లయ్య దేవరస్వామిని కలిపి మలయనూరు, వడ్డెపాళ్యంలో గ్రామోత్సవం నిర్వహించేవారు. ఇటీవల మలయనూరు గ్రామంలో ఆయా దేవుళ్లకు సంబంధించి ఓపెద్ద ఆలయం నిర్మించారు. వడ్డెపాళ్యం రాజులదేవర స్వామిని మలయనూరుకు తీసుకువచ్చి గ్రామోత్సవం నిర్వహించారు.
అయితే జాతర ముగిసిన తరువాత స్వామివారి మూలవిరాట్ను అక్కడే ఉంచుకున్నారని వడ్డెపాళ్యం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్వామివారి మూలవిరాట్ను మలయనూరు ప్రజలు ఇవ్వకపోవడంతో పక్షం రోజుల క్రితం వడ్డెపాళ్యం గ్రామపెద్దలు కేసు పెట్టారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు, తహసీల్దార్ రమేషన్తో పాటు డీఎస్పీ వెంకటరమణ రంగంలోకి దిగి మూలవిరాట్ను వడ్డెపాళ్యం ప్రజలకు ఇవ్వాలని సూచించినా మలయనూరు ప్రజలు ససేమిరా అనడంతో శనివారం రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.