Raksha Bandhan wishes
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా...
అమ్మానాన్నలు మనకు జన్మనివ్వడంతో పాటు మనకు ఇచ్చే మరో గొప్ప వరం తోబుట్టువులు. ఈ ప్రపంచంలోని బంధాల అన్నింటిలోనూ సోదర, సోదరీ బంధం ప్రత్యేకమైనది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం వెలకట్టలేనిది. అంతేకాదు తోడబుట్టకపోయినా కొంతమంది అంతటి ఆప్యాయత, అనుగారాలు పంచే బంధాలు కలిగి ఉండి అదృష్టవంతులు అనిపించుకుంటారు. ఇలా సహోదర భావంతో మెలుగుతూ.. ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష’ అంటూ రాఖీ కట్టుకునే పర్వదినం నేడు. మరి ఈ పండుగ రోజు మీ ఆప్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి. దూరంగా ఉన్నా సరే నేను నీతోనే ఉన్నా అనే భావనతో మనల్ని దగ్గర చేసేందుకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఇలా ఉపయోగించుకోండి! సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన రహస్యాలు తెలిసిన వాళ్లు మనకు అత్యంత ఆప్తులు. వాళ్లే మన తోబుట్టువులు. రాఖీ పూర్ణిమ అందరిలో సరికొత్త కాంతులు తేవాలి. హ్యాపీ రాఖీ బంధన్ ఈ బంధం పెవికాల్ కంటే పటిష్టమైనది. దీన్ని విడగొట్టడం ఎవరి తరమూ కాదు. ప్రతీ అణువులోనూ నిండిన సోదర, సోదరీ ప్రేమానుబంధం. అందరికీ హ్యాపీ రాఖీ పూర్ణిమ. డైరెక్టుగా కట్టినా, పోస్ట్ ద్వారా వచ్చినా.. రాఖీ రాఖీయే. దాన్ని పంపే సోదరి తన ప్రేమంతా అందులో కూర్చుతుంది. అలాంటి వారందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. రాఖీపూర్ణమ అంటే నాకెంతో ఇష్టం. చేతులకు రాఖీలు, సోదరీమణుల దీవెనలూ ఎప్పటికీ కావాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అక్కా, చెల్లీ, అన్నా, తమ్ముడూ.. ఈ పిలుపుల్లో ఉండే తీపి చక్కెర కంటే తియ్యన. తోబుట్టువుల బంధం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ రక్షా బంధన్. Raksha Bandhan Wishes: ‘అమ్మలోని ‘అ' పదం.. నాన్నలోని ‘నా' పదం కలిపితేనే ‘అన్న' అన్నైనా.. తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే'' మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ హ్యాపీ రక్షా బంధన్ ‘‘గులాబీకి ముళ్లు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని హామీ ఇస్తూ సోదరీమణులందరికీ హ్యాపీ రక్షాబంధన్.. ‘‘చిరునవ్వుకు చిరునామా.. మంచి మమతకు మారురూపం... ఆప్యాయతకు నిలువెత్తు రూపమే రక్షాబంధన్'' రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. ‘‘నేను ఏమి చేస్తే మంచిగా ఉంటానో.. నా సోదరులకు బాగా తెలుసు.. అందుకే వారు నాతో ఎప్పటికీ ఉంటారు'' ‘నాకు ఉన్న సోదరుడు స్నేహితుడి లాంటి వాడు. అలాంటి సోదరుడు ఎవ్వరికీ ఉండరు. అందుకే నేను చాలా లక్కీ అని నమ్ముతాను'' Raksha Bandhan Quotes: ప్రపంచం మారుతుంది, కాలం గడుస్తుంది. తోబుట్టువుల ప్రేమానురాగాలు మాత్రం స్థిరంగా ఉంటాయి. వాటికి కాలపరిమితి లేదు. ప్రకృతి ఇచ్చిన స్నేహితుడు సోదరుడు తోబుట్టువుకి తగిన గుర్తింపు తోబుట్టువు వల్లే వస్తుంది. వారి మధ్య బంధం అపరిమితం. ఒకే రక్త సంబంధం కలిగిన పిల్లలలో ఏర్పడిన అనుబంధం తెలియని శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని మరేదీ ఇవ్వలేదు. మన సహోదరులు, సోదరీమణులూ మన వ్యక్తిగత కథల్లో తెల్లవారుజాము నుంచి సాయం సంధ్య వరకు మనతో ఉంటారు. హృదయపూర్వకంగా లభించే బహుమతి సోదరి. తను కట్టే రాఖీ.. మన జీవితానికి అర్థం, పరమార్థం. నాకు సొంత తోబుట్టువులు లేకపోవచ్చు. నా చేతికి కట్టే ప్రతీ రాఖీలో ఆ అనుబంధాన్ని నేను పొందుతాను. రాఖీ పౌర్ణమి వేళ ఈ విషెస్, కోట్స్ మీ స్నేహితులు, బంధువులకు పంపుకోండి. -
సీఎం జగన్‌కు రాఖీ విషెష్ చెప్పాలనుకుంటున్నారా.. అయితే..
అన్నా చెల్లెళ్ల అనుబంధం.. అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగం మాటలకందనిది.. అనుక్షణం ఆనందం పంచుతూ కష్టమన్నదే దరి చేరకుండా రక్షగా నిలిచే సోదరుడి చేతికి కట్టే రాఖీ అమూల్యమైనది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం జగన్‌తో పంచుకోవడానికి ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించండి. ►మొదట మీ వీడియోను రికార్డును చేయండి ►రికార్డు చేసిన మీ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో కానీ ఇతర సోషల్ మీడియా పేజీల్లో కానీ అప్లోడ్ చేయండి. ►7890689927 నెంబర్‌కు రికార్డు చేసిన వీడియోను పంపండి. ఈ రాఖీ పండుగ నాడు మీ అభిమాన సోదరుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న గారికి మీరే ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు వెంటనే మీ సందేశాన్ని సీఎం వైయస్ జగన్ గారితో పంచుకోవడానికి ఈ క్రింది విధంగా అనుసరించండి. pic.twitter.com/cAoaDdysRX — YSR Congress Party (@YSRCParty) August 11, 2022 -
ఒక కొమ్మకు పూచిన అనుబంధం
పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. ‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే. హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. కేరింగ్.. షేరింగ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్ అవలేదు. – విజయలక్ష్మి జీవితానికి మంచి దారి ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్ చెప్పి, పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. – గోపాల్ నా బాధ్యత మా అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – సాయిలు మా అన్న త్యాగం గొప్పది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. – సరోజ కలిస్తే పండగే! రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు. – సుమలత ఒకరికొకరం రక్ష మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం. – సురేష్ మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్‌కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్ చేస్తుంది. నాకు చాక్లెట్స్ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్ కదా అందుకని సగం చాక్లెట్‌ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది. – లాస్య ఎంత పని ఉన్నా ముందుంటాడు మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్‌గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. – అమృత రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఓ హాస్పిటల్లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. – శేఖర్ -
'ఆడపడుచులకు అండగా ఉంటాం'
హైదరాబాద్ : తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం సోదరుడిలా వుండి రక్షణ కల్పిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లు-అన్నాదమ్ముళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ.. మహిళలను అన్ని రంగాల్లో కాపాడుకోవాలని సందేశాన్ని సైతం అందిస్తుందన్నారు. ఆడపడుచులకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.