rallapalli narasimha rao
-
ప్రముఖ నటుడు రాళ్లపల్లి కన్నుమూత
-
సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటుడు రాళ్లపల్లి(63) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతూ హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి వెంకట నరసింహా రావు. ఇంటి పేరుతోనే రాళ్లపల్లిగా ప్రసిద్ధి గాంచారు. రాళ్లపల్లి నరసింహారావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాళ్లపల్లి. స్త్రీ(1973) ఆయన మొదటి చిత్రం. చివరి చిత్రం భలేభలే మగాడివోయ్. సుమారు 850 చిత్రాల్లో రాళ్లపల్లి వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తొలిసారి నంది పురస్కారాన్ని అందుకున్నారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు చిత్రాలు రాళ్లపల్లికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలకపాత్రల్లో రాళ్లపల్లికి నటించే అవకాశం వచ్చింది. రాళ్లపల్లి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాటక, బుల్లితెర, వెండితెరపై తన అసమాన నటనతో, రాళ్లపల్లి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. రచయితగా, దర్శకుడిగా తెలుగు సినీరంగానికి ఎనలేని సేవలందించారని అన్నారు. రాళ్ళపల్లి మృతికి చిరంజీవి సంతాపం చెన్నైలోని వాణి మహల్ లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. 'ఎలా ఉన్నావు మిత్రమా?' అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను. -
పట్టుదలతో సాగితే విజయం తథ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి నరసింహారావు అన్నారు. ఇందుకు ముందుగానే లక్ష్యాన్ని ప్రణాళికబద్ధంగా నిర్దేశించుకోవాలని సూచించా రు. ఖెరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి యువజనోత్సవాలకు ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీయుగంలో వయస్సుతో సంబం ధం లేకుండా ప్రతిభను చాటే అవకాశాలు వస్తున్నాయని, వీటిని గమనించి ముందుకెళ్తే విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. యువత చదువు, సంపాదనకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై దృష్టి సారించాలని, సేవా తత్వాన్ని అలవర్చుకోవాలని సూచిం చారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ సీఈఓ కృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో విడతల వారీగా యువజనోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 25 కేటగిరీల్లో దాదాపు 175 మంది యువతీ, యువకులు జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో జరిగే పోటీలకు నిర్మలాదేవి, శివశంకర్, కృష్ణారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు యువజనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తొలిరోజు కూచిపూడి, భరతనాట్యం, జానపద పాటలు, నృత్యాలు, కర్ణాటక, హిందుస్థానీ సంగీతం తదితర 14 కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. దాదాపు 75 మందికిపైగా పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలు ఈనెల 28న శిల్పారామంలో జరిగే రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇటీవల నిర్వహించిన నియోజకవర్గస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలు తాజా కార్యక్రమాల్లో పోటీ పడుతున్నారు.