తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..!
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. వడగాడ్పులు, వేడిగాలులతో పాటు అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో ఈ భిన్న పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పుల వాన కురుస్తుంటే.. సాయంత్రానికి అకాల వర్షం అలజడి రేపుతోంది. దీనికి ఈదురు గాలులు కూడా తోడై జనాన్ని భయకంపితులను చే స్తూ ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. రెండ్రోజులుగా పడమర దిశ నుంచి వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ ఆటంకాలు) ప్రభావమే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఉరుములు, మెరుపులతో కొద్దిసేపట్లోనే సుడిగాలులతో కూడిన వర్షం కురుస్తుందని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, తర్వాత మళ్లీ ఎండలు, వడగాడ్పులు విజంభిస్తాయని ఆయన విశ్లేషించారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులూ కొనసాగుతూనే ఉన్నాయి.
సోమవారం రామగుండంలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోకెల్లా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. రెంటచింతల, నందిగామల్లో 44, నిజామాబాద్, తిరుపతి, కడప, అనంతపురంలలో 43, కర్నూలు, విజయవాడల్లో 42, హైదరాబాద్, నెల్లూరు, తునిల్లో 41, ఒంగోలు, ఆరోగ్యవరం, కాకినాడల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ వడగాడ్పుల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
ఆయా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.