రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
సైన్స్‌కు, స్పిరిచ్యువాలిటీకి లంకె కుదరదు. లాజిక్కులు, ఆధారాలపై సైన్స్ ఆధారపడితే నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుంది. ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని, ఆ దైవత్వం ఉనికిని జీర్ణించుకుంటుంది. సైన్స్ మాత్రం ఇతిహాసాలు, పురాతాన గ్రంథాల్లో చెప్పినవాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఏది నమ్మాలన్నా సాక్ష్యాధారాలు కావాలంటుంది సైన్స్. ఐతే ఇంత అత్యాధునిక కాలంలోనూ, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎన్నో రహస్యాలను సైన్స్ ఛేదించలేకపోయిందని ఆధ్యాత్మిక వాదులు అంటారు. పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎన్నో మర్మాల గుట్టు ఇంకా బయటపడలేదు. వాటి విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్యనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఆ కోవలోకే వస్తుందీ రామసేతు. శాస్త్ర-సాంకేతిక రంగంలో అమెరికా శాస్త్రవేత్తలకు మంచి పేరే ఉంది. అందులోనూ నాసా సైంటిస్టులంటే గురి కాస్త ఎక్కువ. ఏడేళ్ల క్రితం నాసా శాటిలైట్ కొన్ని చిత్రాలు పంపించింది. మనదేశాన్ని, శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలు అవి. భారత్, శ్రీలంక మధ్య హిందూమహాసముద్రం లోతు తక్కువ ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో నాసా శాటిలైట్ ఒక ఆశ్చర్య కర పరిణామాన్ని గుర్తించింది. ఆ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పెద్ద వస్తువుల కదలికలను ఆ ఉపగ్రహం గుర్తించింది. వెంటనే ఆ కదలికలకు సంబంధించి ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపించింది.నాసా శాటిలైట్ పంపిన ఫోటోల్లో ఉన్న రాళ్లు మామూలు రాళ్లు కాదు. చాలా పెద్ద పెద్ద బండరాళ్లు అవి. దాంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగి పోయింది. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఉన్న రాళ్లు భారత్, శ్రీలంక మధ్య ఉన్న ఓ రాతివంతెనకు సంబంధించినవి. దాంతో ఇండియానా యూనివర్సిటీ నార్త్ వెస్ట్, యూనివర్సిటీ ఆప్ కొలరాడో బౌల్డర్, సదరన్ ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, జియోలజిస్టులు రంగంలోకి దిగి పరిశోధనలు జరిపారు. ఆ పరిశీలనల్లో ఆ రాతి వంతెన 30 మైళ్ల పొడవుతో ఉన్నట్లుగా బయటపడింది. సైంటిస్టులు, జియోలజిస్టులు పరిశోధించిన రాతి వంతెన మరేదో కాదు. భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన శ్రీరామసేతు అది. ఆడమ్ బ్రిడ్జ్‌గా, సేతుబంధనంగా పేర్కొనే రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్లు అవి. దాంతో శాస్త్రజ్ఞుల దృష్టి ఆ రాళ్లు, వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది. భూగర్భశాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు ఇసుక, రాతి వంతెన నిర్మాణాలపై లోతుగా పరిశోధనలు జరిపారు. ఆ రీసెర్చ్‌లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. సైంటిస్టుల పరిశోధనలో ఇసుక నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడినదే అని బయటపడింది. మరి రాతి వంతెన నిర్మాణం మాటేమిటి. అదే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాధానమే ఇప్పుడు యావత్ ప్రపంచపు దృష్టిని మళ్లీ రామసేతుపై పడేలా చేసింది.నాసా శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా రాతి వంతెనపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ వంతెన సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చారు. అంటే ఆ స్టోన్ బ్రిడ్జ్ నిర్మాణం అకస్మాత్తుగానో, ప్రకృతి పరంగానో ఏర్పడింది కాదు. ఎవ్వరో ఆ రాళ్లను తీసుకొచ్చి ఆ ఇసుక నిర్మాణంపై పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎలా అక్కడికి చేరుకున్నాయి...?ఇసుక నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడిందని తేల్చిన శాస్త్రవేత్తలు రాళ్ల సంగతిని తేల్చే పనిలో పడ్డారు. జియోలజిస్టులు రంగంలోకి దిగి ఆ రాళ్లపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ రీసెర్చ్‌లో మరో విస్మయకర విషయం బయటపడింది. శాస్త్రీయ విశ్లేషణల ప్రకారం ఆ రాళ్లు 7వేల ఏళ్ల క్రితం నాటివి. కానీ ఆశ్చర్యకరంగా రాళ్లతో ఉన్న ఇసుక మాత్రం 4వేల ఏళ్ల క్రితం నాటిదే. ఇది క్రీస్తు పూర్వం ఏర్పడింది కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఇసుక వయసు కంటే రాళ్ల వయసు తక్కువ. కార్బన్ డేటింగ్ప్రక్రియ ఆధారంగా రాళ్లు, ఇసుక వయసులను లెక్క కట్టిన సైంటిస్టులు రాతివంతెన నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చి చెప్పారు. ఆ వారధి మానవులు నిర్మించిందే అని స్పష్టం చేశారు. భారతీయ పరిశోధకుల అంచనా ప్రకారం సుమారు 5 వేల ఏళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య ఓ వారధి నిర్మాణం జరిగింది. అప్పట్లో శ్రీరామునిగా మానవ రూపంలో అవతరించిన భగవానుడు ఆ వారధిని నిర్మించారన్నది హిందువుల విశ్వాసం. ఇప్పుడు విదేశీ సైంటిస్టులు చెబుతున్నది కూడా అదే. అంటే పరిశోధకులు చెబుతున్నదీ, పురాణాలు పేర్కొంటున్నదీ ఒక్కటే అన్నమాట. అంటే రామసేతు నిర్మాణం మానవ నిర్మిత అద్భుతమే అనుకోవాలి.హిందువుల విశ్వాసాలతో పెనవేసుకుపోయిన రామసేతు భారత్, శ్రీలంకను కలిపే వారధి. తమిళనాడులోని రామేశ్వరం దీవి సమీపంలో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక సమీపంలో ఉన్న మన్నార్ద్వీపాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మాణం ఉంటుంది.ధనుష్కోడి నుంచి మన్నార్ ద్వీపం మధ్య అంతా సముద్రమే ఉన్నప్పటికీ లోతు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఆ రాతి వంతెనకు సంబంధించిన రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. స్థానిక ఆలయవర్గాల సమాచారం ప్రకారం 50 కిలో మీటర్ల పొడవైన ఈ వంతెన 15వ శతాబ్దం వరకు సముద్ర మట్టానికి పైనే ఉండేది. 1480లో సంభవించిన పెను తుపాను ధాటికి ఆ వంతెన కూలిపోయింది.ఇక రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్న అంశంపై చాలా వాదనలున్నాయి. ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్-ICHR, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థలతో పాటు దేశ, విదేశీ సైంటిస్టుల బృందాలు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిశోధననలు జరిపాయి. భారత్‌నుంచి శ్రీలంకను వేరు చేసే క్రమంలో సున్నితమైన సున్నపురాయి గుట్టలు ముక్కలు ముక్కలయ్యాయని, తర్వాత ఆ రాతి ముక్కలే వంతెనగా రూపాంతరం చెందాయని, కాబట్టి అది కృత్రిమ వంతెనే అని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.దాదాపు 103 చిన్న చిన్న గుట్టల నిర్మాణమే ఆడమ్ బ్రిడ్జ్ అని మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్ పేర్కొంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం ఆ వంతెన లక్ష 25 వేల ఏళ్ల క్రితం నాటిదని అభిప్రాయపడింది. ఐతే రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఉన్న రాళ్ల శాంపిల్లను రేడియో కార్భన్ డేటింగ్లో పరిశోధిస్తే అవి 7 వేల నుంచి 18 వేల ఏళ్ల క్రితం నాటివని బయటపడింది. ప్రొఫెసర్ SM రామస్వామి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్పరిశోధనలో ఆ రాళ్ల వయసు 3 వేల 5 వందల సంవత్సరాలుగా తేలింది.