రామ మందిరం నిర్మాణంపై 'మన్ కీ బాత్' చెప్పరేం!!
ముంబై: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశంలో నెలకొన్న అన్ని సమస్యలపై అనర్గళంగా మాట్లాడుతోన్న ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపైనా స్పందించాలని ఎన్డీఏ మిత్రపక్షం శివసేన పార్టీ తన పత్రిక సామ్నా సంపాదాకీయంలో పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా చట్టసభలోనో లేక మరో మార్గంలోనే సమస్యను పరిష్కరించి మందిరం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, ఈ విషయంలో బీజేపీ అనవసర భయాలకు పోతోందని ఆ పార్టీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలను ఉటంకించిన శివసేన.. మందిర నిర్మాణంపై మోదీ మన్ కీ బాత్ బయటపెట్టాలని డిమాండ్ చేసింది.
కాగా, మత సామరస్యానికి విఘాతం కలిగించే ఎలాంటి చేయబోనని, ఎవరరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసిన మరుసటిరోజే బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.