ఆర్కేకు గాయాలు.. అయినా సురక్షితమే
⇒ హైకోర్టుకు నివేదించిన రామకృష్ణ సతీమణి శిరీష
⇒ నిర్దిష్ట సమాచారం అందిందని వెల్లడి
⇒ పిటిషన్ ఉపసంహరణకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి
⇒ ఈ విషయాలన్నీ రాతపూర్వకంగా మా ముందుంచండి: ధర్మాసనం
⇒ విచారణ సోమవారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నారని ఆయన భార్య శిరీష శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఆర్కే గాయపడ్డారని, అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే, ఈ విషయాలన్నింటినీ రాతపూర్వకంగా న్యాయస్థానం ముందుంచాలని శిరీషకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో తన భర్త ఆర్కే గాయపడ్డారని, ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖప రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ గురువారం కౌంటర్ దాఖలు చేశారు. ఆర్కే తమ కస్టడీలో లేరని కోర్టుకు నివేదించారు. అయితే ఈ వాదనలను శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తోసిపుచ్చారు. ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారన్న పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలను కోర్టు ముందుంచాలని, వాటిని పరిశీలించి అవసరమైన పక్షంలో విచారణకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువు ఇచ్చింది.
ఆర్కే సురక్షితంగా ఉన్నట్లు గురువారం రాత్రి విరసం నేత వరవరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తమకు అందిన సమాచారం ప్రకారం ఆర్కే సురక్షితంగా ఉన్నారని ధర్మాసనానికి నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... నిన్ననే కదా.. ఆర్కే ఆచూకీ తెలియడం లేదు, పోలీసుల కస్టడీలోనే ఉన్నారని చెప్పారు అంటూ ప్రశ్నించింది. పోలీసుల కాల్పుల్లో ఆర్కే గాయపడ్డారని, అందువల్ల ఇంతకాలం ఎక్కడున్నారో తెలియలేదని, ఇప్పుడు ఆయన సురక్షితంగా ఉన్నట్లు నిర్ధిష్టమైన సమాచారం అందిందని రఘునాథ్ పేర్కొన్నారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని శిరీష భావిస్తున్నారని, అందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు. ఈ విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచాలని ధర్మాసనం రఘునాథ్‌కు స్పష్టం చేసింది. దానిని పరిశీలించి ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది.