ఆందోళనల నడుమ ఈసీ సమావేశం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ హెచ్‌సీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలోని పరిపాలనా విభాగంలో బుధవారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సమావేశాన్ని పలు విద్యార్థి సంఘాలు అడ్డుకునేందుకు యత్నించాయి.
తాజాగా విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య ఘటనపై బాధ్యులను శిక్షించాలని, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ నివేదికను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ తప్పిదాలతో ఆత్మహత్య చేసుకున్న పుల్యాల రాజు, పీహెచ్డీ విద్యార్థి వెంకటేశ్ కుటుంబాలకు పరిహారం అందజేయాలని పట్టుబట్టారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వీసీ రామకృష్ణ రామస్వామికి అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఏ, టీఎస్ఏ, ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ,బీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐల నాయకులు పాల్గొన్నారు.
వీసీ అంగీకరించిన డిమాండ్లు ఇవే...
ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్, పుల్యాలరాజుల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు హామీ.
2008 నుంచి జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర విచారణ చేసేందుకు నిర్ణయం.
బాధ్యులుగా తేలితే ప్రొఫెసర్లపై చర్యలకు నిర్ణయం.
విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సమన్వయం కుదిర్చేందుకు తగిన రిఫ్రెష్మెంట్ క్లాసుల నిర్వహణ.
యూనివర్సిటీలో సైకాలజిస్ట్లచే విద్యార్థుల్లో మానసిక స్వావలంబన చేకూర్చేందుకు కార్యక్రమాలు.
కోలుకుంటున్న ఇషానీ..
హెచ్‌సీయూలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కలకత్తాకు చెందిన ఇషానీ(19) హెచ్‌సీయూలో ఎంఏ చరిత్ర విభాగంలో మొదటి సంవత్సరం చదవుతోంది. మంగళవారం రాత్రి ఆమె బ్లేడుతో చేతిపై కోసుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.