Ramalaksmanulu
-
రావణా! నిన్ను చంపింది రాముడు కాదు!
సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే... భర్త అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు... ఆ దుఃఖానికి అవధి ఉండదు. మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే... గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే... దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే... మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే... రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది.. అని అనుకుంటారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే...పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి... ఏడుస్తూ...‘‘వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా! రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు... నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు... అయినా నాలోలేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది?’’ ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతివైభవం. ఈ ఒక్కమాట లోకానికి అందితే జాతి చేయకూడని పొరబాట్లు చేయదు. పిల్లలకు పాఠశాలల్లో రామాయణం చెపితే తప్పు, భారత భాగవతాలు చెపితే తప్పు. మంచి శ్లోకం ఉండకూడదు... అన్నప్పుడు సంస్కారం ఎక్కడినుంచి అందుతుంది? ఒక పాత్రలో పాయసం పోశారు. అది రాగిపాత్ర. మరొక బంగారు పాత్రలో పాయసం పోసారు. బంగారు పాత్రలోది తాగినా, రాగిపాత్రలోది తాగినా పాయసానికి రుచి ఒకటే. రాగి పాత్ర నీదయినప్పుడు ధర్మం తప్పకుండా రాగిపాత్రలోనే తాగు. నీది కాని బంగారు పాత్రలోది తాగాలని మాత్రం అలమటించకు. పాత్ర మెరుగులు, మిలమిలలు చూసి గీత దాటితే భ్రష్టుడవయిపోతావు. కొన్ని కోట్ల జన్మలు కిందకు జారిపోతావు. మండోదరిలాంటి స్త్రీల వారసత్వం ఈ జాతి సంపద. ఎక్కడున్నా వాళ్లు భర్తకు శాంతి స్థానాలు. వాళ్ళు భర్తలకు మంచి మాటలు చెప్పారు తప్ప భర్త పరిధి దాటి అక్కరలేని విషయాల జోలికి వెళ్ళి పైపై మెరుగులకోసం, తాత్కాలిక సుఖాలకోసం కష్టాలను కౌగిలించుకోవాలని ఎన్నడూ ప్రబోధం చేయలేదు.. -
అపహాస్యం తెచ్చిన అనర్థం
సీతని ఎవరో రాక్షసుడు అపహరించాడని జటాయువు ద్వారా తెలుసుకున్న రామలక్ష్మణులు ఆమెకోసం వెతుకుతూన్న సమయంలో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అదేంటో తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా ఒక విచిత్రమైన, వికృతమైన ఆకారం వారికి కనిపించింది. ఆ ఆకారానికి తల, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం ఛాతీలోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే అగ్నిజ్వాలలా ఎర్రగా ఉన్న ఒక కన్ను, ఆ కంటికి ఒక పెద్ద రెప్ప ఉన్నాయి. ఆ ఆకారం చేతులు ఒక యోజనం పొడవుగా ఉన్నాయి. చూస్తుండగానే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుని, తినడానికి సంసిద్ధమయింది. వెంటనే రాముడు ఆ ఆకారం కుడిచేతిని, లక్ష్మణుడు ఎడమచేతినీ ఖండించి వేశారు. వారలా చేయగానే ఆ ఆకారం సంతోషంతో ‘మీరు రామలక్ష్మణులు కదా,’ అని అడిగింది. రామలక్ష్మణులు ఆశ్చర్యంతో ‘‘ఎవరు నీవు? నీకీ ఆకారం ఎలా వచ్చింది?’’ అని అడిగారు. ఆ ఆకారం ఇలా చెప్పింది. ‘నేను ధనువు అనే గంధర్వుడిని. అత్యంత సుందరమైన శరీరం కలిగిన వాడిని.ఆ అందం వల్ల కలిగిన గర్వంతో నా కామరూప శక్తి చేత విచిత్రమైన రూపాలు ధరించి ఋషులను, మునులను భయ కంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఒక ఋషికి ఈరోజు నేను ఉన్న ఈ రూపంతో కనిపించాను. సర్వజ్ఞుడైన ఆ రుషి ‘నీకు ఇటువంటి భయంకరమైన, జుగుప్సాకరమైన రూపం ఇష్టంలా అనిపిస్తున్నది కనుక నువ్వు ఎప్పటికీ ఈ రూపంతోనే ఉందువు గాక’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రాధేయపడ్డాను. ‘నీవు ఈ రూపంతో ఉండగా రామలక్ష్మణులు వచ్చి నీ చేతులు ఖండించి నిన్ను అగ్నిలో దహించిన తర్వాత నీకు నిజరూపం వస్తుంది’ అని సెలవిచ్చాడు. అప్పటినుండి నేను ఈ దారిన వెళ్లే జీవులందరినీ సంహరించి తింటూ, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత మీరు సీతమ్మను వెతకడానికి మార్గం చెప్పగలను’’ అని అన్నాడు. రామలక్ష్మణులు ఒక పెద్ద గొయ్యి తీసి, కబంధుడి శరీరాన్ని ఆ గోతిలోకి నెట్టివేసి, ఎండిన కర్రలను వేసి అగ్నిసంస్కారం చేసారు. ఆ శరీరం కాలగానే ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై వారికి నమస్కరించి ‘‘రామా! మీరు ఈ విధంగా వెతికితే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో మీకు ప్రపంచ మంతా చుట్టిన ఒక మిత్రుడు అవసరం. అటువంటి అత్యంత బలవంతుడయిన సుగ్రీవుడనే ఒక వానరరాజు ఉన్నాడు. ఆతను ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అతను ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. నీవు అతనితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. మంచి జరుగుతుంది’’ అని అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పి వెళ్ళిపోయాడు. మన అందచందాలు, శక్తి సామర్థ్యాలను చూసుకుని విర్రవీగడం, మనకున్న శక్తులను ఇతరులను అపహాస్యం చేసేందుకు ఉపయోగించడం మిక్కిలి అనర్థదాయకం. – డి.వి.ఆర్. భాస్కర్ -
జాతీయాలు
అనామకంగా! ‘నిన్నా మొన్నటి వరకు అనామకంగా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు ప్రముఖుడయ్యాడు’ ‘పాపం... అతడి జీవితం అనామకంగా ముగిసింది’... ఇలాంటి మాటలను వింటుంటాం. అసలేమిటీ అనామకం? పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఎవరి దృష్టీ సోకని వ్యక్తులు, ప్రదేశాల విషయంలో ‘అనామకం’ మాటను వాడుతుంటారు. ఈ అనామకం వెనుక ఒక పురాణకథ ఉంది. బ్రహ్మదేవుడికి ఒకప్పుడు అయిదు తలలు ఉండేవట. ఒకసారి ఆయనకి, శివుడికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శివుడు తన ఉంగరపు వేలి గోరుతో శివుడి అయిదవ తలను సంహరించాడు. ఉంగరపు వేలును సంస్కృతంలో అనామిక అంటారు. ఏ వేలుతో అయితే శివుడు బ్రహ్మదేవుడి తలను సంహరించాడో, ఆ వేలును వేదకర్మలలో ఉపయోగించకూడదని, ఉచ్చరించకూడదనే నియమం ఏర్పడింది. ఈ అనామిక నుంచే అనామకం అనే జాతీయం పుట్టింది. బాదరబందీ! పూర్వపు రోజుల్లో రాజుల దగ్గర పని చేసే ఉన్నతోద్యోగులు పొడవాటి అంగరఖా ధరించేవారు. అంగరఖా కుడి, ఎడమ అంచులను చిన్న చిన్న దారాలతో ముడివేసేవాళ్లు. అవి మొత్తం పన్నెండు ఉండేవి. రోజూ ఈ పన్నెండు ముళ్లనూ వేయడమనేది సహనానికి పరీక్షలా ఉండేది. అలా అని కుదరదు అనడానికి లేదు. చచ్చినట్లు వాటిని కట్టుకొని కొలువుకు వెళ్లాల్సిందే. హిందీలో పన్నెండును బారా అంటారు. బారా, బాధ... ఈ రెండూ కలిసి ‘బాదర’గా రూపుదిద్దుకుంది. దీనికి చివర ‘బందీ’ కూడా చేరిపోయింది. చికాకు పుట్టించి, సమస్యగా తోచే వ్యవహారాలు, భారంగా తోచే అనివార్య బాధ్యతల విషయంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘అతడికి ఎలాంటి బాదరబందీ లేదు. హాయిగా కాలం గడుపుతున్నాడు’... ‘నీకేం ఎన్నయినా చెబుతావు. మాలా బాదరబందీ ఉంటే అర్థమవుతుంది’... ఇలా అన్నమాట! కబంధ హస్తాలు! ఎవరైనా చెడ్డవ్యక్తుల బారిన పడినప్పుడు- ‘ఆ కబంధహస్తాల నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు’ అంటుంటారు. ఇంతకీ ఏమిటీ కబంధ? అడవిలో సీతమ్మ కోసం రామలక్ష్మణులు వెదుకుతున్నప్పుడు వారి ముందుకు ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి కాళ్లు, తల, మెడ ఉండవు. కడుపు భాగంలో మాత్రం నోరు ఉంటుంది! చేతులైతే చాలా పొడవు. ఎవరైనా తన నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తే చేతుల్తో పట్టుకునేవాడు. ఆ పట్టు చాలా గట్టిగా ఉండేదట. అందుకే కబంధ హస్తం అని పేరొచ్చింది. ఆ చేతుల్ని తర్వాత రామలక్షణులు నరికేస్తారు. నిజానికి కబంధుడు అందగాడు. కానీ అహంకారి. ఓసారి ఒక మునిని ఆట పట్టించడానికి వికృతరూపం ధరిస్తే.. ఆ మునికి కోపం వచ్చి- ‘‘ఈ రూపమే నీకు శాశ్వతంగా ఉంటుంది’’ అని శపిస్తాడు. అలంకృత శిరచ్ఛేదం! పూర్వపు రోజుల్లో నేరాలు ఘోరాలు చేసిన వారి తల నరికేసేవారు. అయితే నరకడానికి ముందు నేరస్తుడి కోరిక ఏదైనా ఉంటే తీర్చేవారు. అంతేకాదు... అతడి తలను అందంగా అలంకరించేవారు. ఆ తరువాతే ఆ తలను నరికేవారు. దాని ఆధారంగానే ఈ జాతీయం పుట్టింది. కొందరు తమ పని పూర్తయ్యేంత వరకు... చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే వారి పని పూర్తయిపోతుందో, అప్పటి నుంచి వారి స్వభావంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. వారిలోని దుర్మార్గం బట్టబయలై భయపెడుతుంది. ఇలాంటి వారి విషయంలో ఉపయోగించే జాతీయం ఇది.