సీతని ఎవరో రాక్షసుడు అపహరించాడని జటాయువు ద్వారా తెలుసుకున్న రామలక్ష్మణులు ఆమెకోసం వెతుకుతూన్న సమయంలో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అదేంటో తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా ఒక విచిత్రమైన, వికృతమైన ఆకారం వారికి కనిపించింది. ఆ ఆకారానికి తల, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం ఛాతీలోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే అగ్నిజ్వాలలా ఎర్రగా ఉన్న ఒక కన్ను, ఆ కంటికి ఒక పెద్ద రెప్ప ఉన్నాయి. ఆ ఆకారం చేతులు ఒక యోజనం పొడవుగా ఉన్నాయి. చూస్తుండగానే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుని, తినడానికి సంసిద్ధమయింది. వెంటనే రాముడు ఆ ఆకారం కుడిచేతిని, లక్ష్మణుడు ఎడమచేతినీ ఖండించి వేశారు. వారలా చేయగానే ఆ ఆకారం సంతోషంతో ‘మీరు రామలక్ష్మణులు కదా,’ అని అడిగింది. రామలక్ష్మణులు ఆశ్చర్యంతో ‘‘ఎవరు నీవు? నీకీ ఆకారం ఎలా వచ్చింది?’’ అని అడిగారు. ఆ ఆకారం ఇలా చెప్పింది.
‘నేను ధనువు అనే గంధర్వుడిని. అత్యంత సుందరమైన శరీరం కలిగిన వాడిని.ఆ అందం వల్ల కలిగిన గర్వంతో నా కామరూప శక్తి చేత విచిత్రమైన రూపాలు ధరించి ఋషులను, మునులను భయ కంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఒక ఋషికి ఈరోజు నేను ఉన్న ఈ రూపంతో కనిపించాను. సర్వజ్ఞుడైన ఆ రుషి ‘నీకు ఇటువంటి భయంకరమైన, జుగుప్సాకరమైన రూపం ఇష్టంలా అనిపిస్తున్నది కనుక నువ్వు ఎప్పటికీ ఈ రూపంతోనే ఉందువు గాక’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రాధేయపడ్డాను. ‘నీవు ఈ రూపంతో ఉండగా రామలక్ష్మణులు వచ్చి నీ చేతులు ఖండించి నిన్ను అగ్నిలో దహించిన తర్వాత నీకు నిజరూపం వస్తుంది’ అని సెలవిచ్చాడు. అప్పటినుండి నేను ఈ దారిన వెళ్లే జీవులందరినీ సంహరించి తింటూ, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత మీరు సీతమ్మను వెతకడానికి మార్గం చెప్పగలను’’ అని అన్నాడు.
రామలక్ష్మణులు ఒక పెద్ద గొయ్యి తీసి, కబంధుడి శరీరాన్ని ఆ గోతిలోకి నెట్టివేసి, ఎండిన కర్రలను వేసి అగ్నిసంస్కారం చేసారు. ఆ శరీరం కాలగానే ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై వారికి నమస్కరించి ‘‘రామా! మీరు ఈ విధంగా వెతికితే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో మీకు ప్రపంచ మంతా చుట్టిన ఒక మిత్రుడు అవసరం. అటువంటి అత్యంత బలవంతుడయిన సుగ్రీవుడనే ఒక వానరరాజు ఉన్నాడు. ఆతను ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అతను ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. నీవు అతనితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. మంచి జరుగుతుంది’’ అని అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పి వెళ్ళిపోయాడు. మన అందచందాలు, శక్తి సామర్థ్యాలను చూసుకుని విర్రవీగడం, మనకున్న శక్తులను ఇతరులను అపహాస్యం చేసేందుకు ఉపయోగించడం మిక్కిలి అనర్థదాయకం.
– డి.వి.ఆర్. భాస్కర్
అపహాస్యం తెచ్చిన అనర్థం
Published Sun, Nov 11 2018 12:29 AM | Last Updated on Sun, Nov 11 2018 12:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment