నేటి నుండి శ్రీరామలింగేశ్వరస్వామి జాతర
- ఏప్రిల్ 10 వరకు ఉత్సవాలు
- ముస్తాబైన ఆలయం
గొల్లపల్లి (కరీంనగర్)
మండలంలోని చిల్వకోడూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి భక్తులకు కోర్కెలు తీర్చి నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. జిల్లా నలుమూలల నుండి ఆశేషభక్తజనం ఈ ఉత్సవాలకు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే రామలింగేశ్వరస్వామి భక్తుల పాలిట ఇలవేల్పుగా విరాజిల్లుతున్నాడు.
కరీంనగర్‌కు ఉత్తరాన 70 కి.మీ దూరంలో జగిత్యాల తూర్పున 20 కిలో మీటర్ల దూరంలో జగిత్యాల నుండి పెద్దపెల్లికి వెళ్లే రహదారిపై ఉన్న చిల్వకోడూర్ గ్రామంలో జంపన్నవాగు ఒడ్డున శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు తమ ఇలవేల్పు దైవంగా ఆరాదిస్తారు.
ఆలయ పురాణం :
ఈ ఆలయం కళ్యాణి చాలుక్య కళారీతిని ప్రతి బింబిస్తుంది. 11వ శతాబ్దపు చివరి బాగంలో లేదా 12వ శతాబ్దపు ప్రథమార్థంలో నిర్మించబడిందని ఇక్కడి ప్రాంతవాసుల నమ్మకం. రాయికల్ మండలం కేంద్రంలో ఉన్న త్రికుటాల శివుడు, సూర్యుడు, విష్ణువు ప్రతిష్టించబడినారు. పొలాస రాజదానిగా పొలాస రాజులు తమ రాజ్యాదికారమును గోదావరిని ఆనుకొని తూర్పున మంత్ర కూటమును దాటి వరంగల్ జిల్లాలోని నర్సంపేట తాలూక వరకు మల్లన్నపేట, చిల్వకోడూర్, నందిమేడారం, రామగుండం, మంథని, నర్సంపేట ప్రాంతంనందు దేవాలయాలు నిర్మించినారని, వీరు శైవ, వైష్ణవ, సౌర, జైన దేవతల ఆరాదికులని దవపరుస్తున్నాయి. ఈ దేవాలయం అధిష్టానం భూమిలో మునిగి ఉంది. ఆలయానికి తూర్పు, ఉత్తర దిశల ప్రవేశధ్వారాలు, మంటపమునందు గణపతి, దేవి, నంది విగ్రహాలున్నాయి. సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేసి ఆలయంలో పూజలు చేస్తారు.
జాతర విశిష్టత :
ఆలయం ఎదుట ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం, కళ్యాణోత్సవం, రథోత్సవం, ఎడ్లబండ్ల ఉత్సవాలు, ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. మూడు రోజుల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఖరీఫ్‌లో వేసిన దీర్ఘకాలిక పంటలు, రబీలోని అంతరపంటలు విక్రయించే దశలో ఉంటాయి. కాబట్టి రైతుల దన, ధాన్య ఆనందంలో ఈ ఉత్సవాలకు కుటుంబ సమేతంగా తరలివస్తారు. ఉగాది పర్వదినా ఉత్సవాలు జరిగే రామలింగేశ్వరస్వామి జాతరను ఉగాది జాతరగా భక్తులు పిలుస్తారు.
రథోత్సవం, బండ్ల ఉత్సవాలు తిలకించడానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో సందడిగా ఉంటుది. రామలింగేశ్వరస్వామి మహత్యం దశదిశ వ్యాపించడంతో జిల్లా నలుమూలల నుండి భక్తులు కుటుంబ సభ్యులతో ప్రతి ఏడాది రామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. పక్కనే జర పన్న వాగు ప్రవాహం ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం కలిగిస్తుంది.కాగా ఏడాది కరువు వల్ల ఆ వాతావారణం కనిపించదు.
ఉత్సవ తేదీలు :
06న అష్టబలి, స్థాలీపాకం, 07 గురువారం నాగవెల్లి, 08న సాయంత్రం5 గంటలకు నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం, స్వామివారి సేవ,09న శనివారం మద్యాహ్నం 3 గంటలకు స్వామి వారి రథోత్సవం, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ, 10న ఆదివారం సాయంత్రం బండ్ల ఉత్సవములు, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఎడ్లబండ్ల పోటీలు, మద్యాహ్నం 12 గంటలకు అన్నదానం నిర్వహించనున్నట్ల ఆలయ కమిటి తెలిపింది.
పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 2.5 గ్రాముల బంగారం(దాత వైద్యులు ఎల్లాల శ్రీనివాస రెడ్డి) ద్వితీయ,100 గ్రామల వెండి తృతీయ 50 గ్రాముల వెండి బహుమతి,( దాత వైద్యులు ప్రవీణ్ కుమార్ ఫిజియే తెరపి హాస్పిటల్ జగిత్యాల),ప్రధానం చేస్తామని జిల్లా నలుమూలల నుండి భక్తులను బస్సు సౌకర్యం ఉందని ఆలయ కమిటి చైర్మేన్ గర్వందుల మిల్ట్రీ మల్లయ్య తెలిపారు.