ramanujasahasrabdi
-
మూర్తీ’భవించిన రామానుజ స్ఫూర్తి
శంషాబాద్ రూరల్: నేటి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను రూపుమాపడానికి, రామానుజుల స్ఫూర్తిని అందించడానికి సమతామూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చెప్పారు. బుధవారం నుంచి జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం వచ్చిన పోలీసులకు ఆయన ప్రవచనం చేశారు. రామానుజుల విశిష్టతను తెలియజేశారు. కూలీలు మొదలుకొని రైతుల, చిరు ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చారన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం చాలా ఉందన్నారు. సమారోహ ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలని సిబ్బంది, అధికారులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఘట్టానికి సుమారు 7 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కానున్నారు. ప్రధాన యాగశాల ఏర్పాట్లు పూర్తి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలకు ప్రధాన యాగశాలను సిద్ధం చేశారు. మరోవైపు సినీ చిత్ర కళాకారుడు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రెండు వేల మంది సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మండపం నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు వారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వనున్నారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్యశాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. -
భక్తిపారవశం..
తిరుపతి కల్చరల్ : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా భారతీయ విద్యాభవన్, శ్రీవేంకటేశ్వర విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో నిర్వహించిన రామానుజ శోభాయాత్ర భక్తిపారశంగా సాగింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్ద శ్రీరామానుజ శోభాయాత్ర ఉత్సవ విగ్రహాలకు పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, శ్రీరామకృష్ణ మఠం కార్యదర్శి అనుపమానందజీ పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. పెద్దజీయర్ స్వామి మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ వారు సనాతన ధర్మాలను భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు. భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణరాజు మాట్లాడుతూ భగవంతుని కృపతో భారతీయ విద్యాభవన్ అలిపిరి వద్ద ఉండడం ఆధ్యాత్మికంగా శక్తివంతమైందన్నారు. అనుమానందజీ మాట్లాడుతూ రామానుజాచార్యుల వెయ్యి ఏళ్ల జయంతిని తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ వారు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం సత్యనారాయణరాజు, పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్ స్వామి, అనుమానందజీలను ఘనంగా సత్కరించారు. శోభా యాత్ర గోవిందరాజస్వామి ఆలయం నుంచి కోదండరామాలయం మీదుగా వివేకానంద సర్కిల్, అక్కడి నుంచి అలిపిరి వరకు సాగింది. సుమారు 500 మంది పాల్గొని దివ్య ప్రబంధ పాశురాలను పఠిస్తూ యాత్రను సాగించారు. అలిపిరి వద్ద విద్యార్థులు సంక్షేప రామాయణ పారాయణం చేశారు. తిరుమల నంది, శ్రీరామానుజాచార్యుల వేషధారణలో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్ పీవీ.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ బి.వెంగమ్మ, పి.సుదర్శనరాజు, సీహెచ్.గోవిందరాజు, విద్యా భవన్ కమిటీ సభ్యులు జగ్గారావు, ప్రిన్సిపాల్ ఇందిరా, వైస్ ప్రిన్సిపాల్ హైమావతి పాల్గొన్నారు.