శ్రీరామానుజ శోభా యాత్ర
తిరుపతి కల్చరల్ : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా భారతీయ విద్యాభవన్, శ్రీవేంకటేశ్వర విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో నిర్వహించిన రామానుజ శోభాయాత్ర భక్తిపారశంగా సాగింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్ద శ్రీరామానుజ శోభాయాత్ర ఉత్సవ విగ్రహాలకు పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, శ్రీరామకృష్ణ మఠం కార్యదర్శి అనుపమానందజీ పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. పెద్దజీయర్ స్వామి మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ వారు సనాతన ధర్మాలను భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు. భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణరాజు మాట్లాడుతూ భగవంతుని కృపతో భారతీయ విద్యాభవన్ అలిపిరి వద్ద ఉండడం ఆధ్యాత్మికంగా శక్తివంతమైందన్నారు. అనుమానందజీ మాట్లాడుతూ రామానుజాచార్యుల వెయ్యి ఏళ్ల జయంతిని తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ వారు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం సత్యనారాయణరాజు, పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్ స్వామి, అనుమానందజీలను ఘనంగా సత్కరించారు. శోభా యాత్ర గోవిందరాజస్వామి ఆలయం నుంచి కోదండరామాలయం మీదుగా వివేకానంద సర్కిల్, అక్కడి నుంచి అలిపిరి వరకు సాగింది. సుమారు 500 మంది పాల్గొని దివ్య ప్రబంధ పాశురాలను పఠిస్తూ యాత్రను సాగించారు. అలిపిరి వద్ద విద్యార్థులు సంక్షేప రామాయణ పారాయణం చేశారు. తిరుమల నంది, శ్రీరామానుజాచార్యుల వేషధారణలో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్ పీవీ.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ బి.వెంగమ్మ, పి.సుదర్శనరాజు, సీహెచ్.గోవిందరాజు, విద్యా భవన్ కమిటీ సభ్యులు జగ్గారావు, ప్రిన్సిపాల్ ఇందిరా, వైస్ ప్రిన్సిపాల్ హైమావతి పాల్గొన్నారు.