Ramasamudram Mandal
-
ఆపరేషన్ గజ ప్రారంభం
– అడ్డకొండకు చేరిన గజరాజు – ఫారెస్ట్ అధికారుల మోహరింపు – హైదరాబాద్ నుంచి షూటర్లు, డాక్టర్లు – ననియాల నుంచి శిక్షణ ఏనుగులు రామసముద్రం/రామకుప్పం: రామసముద్రం మండలంలో రెండు రోజులుగా బీభత్సం సృష్టించి, ఓ వ్యక్తిని తొక్కి చంపిన గజరాజును బంధించేందుకు అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆదివారం రోజంతా హల్చల్చేసిన ఏనుగు రాత్రికి ఎర్రప్పపల్లె, కొత్తూరు, ఎం.గొల్లపల్లె, దిన్నెపల్లె, ఊలపాడు మీదుగా రామసముద్రం సమీపంలోని సబ్ స్టేషన్లోని చింతతోపులోకి చేరుకుంది. అక్కడ రాత్రంతా పోలీస్, అటవీశాఖ అధికారులు గస్తీ చేశారు. సోమవారం గజరాజు సమీపంలోని అడ్డకొండ అడవిలోకి చేరుకున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా కుప్పం, తిరుపతి, పలమనేరు ప్రాంతాల నుంచి పలువురు అటవీశాఖ అధికారులు రామసముద్రం మండలానికి చేరుకున్నారు. గజరాజు వెళ్లిన జాడలను గుర్తించేందుకు అడ్డకొండ అడవిలోకి సిబ్బంది చేరుకున్నారు. అక్కడ గజరాజును గుర్తించి కిందకు దారిమళ్లించే ప్రయత్నం చేశారు. గజరాజు ఎదురు దాడికి పాల్పడగా సిబ్బంది కింద ఉన్న ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి దాని అలికిడిని గుర్తిస్తూ పహారా నిర్వహించారు. కిందికి రప్పించడం తమతో సాధ్యం కాదని సిబ్బంది తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ననియాల ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి శిక్షణ పొందిన ఏనుగులు వినాయక్, జయంత్లను అడ్డకొండ ప్రాంతానికి తరలించారు. వాటి ఘీంకారంతో అడవిలో ఉన్న ఏనుగు బయటకు వస్తుందని భావిస్తున్నారు. బంధించేందుకు హైదరాబాద్ నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే షూటర్లు, వైద్యులు కూడా చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆపరేషన్ ప్రారంభం కావడంతో అటవీశాఖ, పోలీసు బలగాలను కొండచుట్టూ మొహరించారు. జనం సమీపానికి రాకుండా దూర ప్రాంతానికి తరిమేశారు. చీకటి కావస్తున్నా గజరాజు అడవి నుంచి బయటకు రాకపోవడంతో అటవీశాఖ సిబ్బంది టపాకాయలు పేల్చుతూ అరుపులు, కేకలతో దాన్ని కిందకు మళ్లించే యత్నంచేశారు. చీకటి పడే సమయానికి అడవిలో నుంచి వెనుదిరిగిన ఏనుగు టపాకాయల శబ్ధానికి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో చక్రపాణి, అటవీశాఖ సీఐ, ఎస్లు, చిత్తూరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు ప్రాంతాల నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పుంగనూరు సీఐ రవింద్ర, ఎస్ఐ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఏనుగును పట్టుకునే దృశ్యాన్ని చూసేందుకు ఆ ప్రాంతానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
భీ‘కరి’
భీ‘కరి’ – రామసముద్రం మండలం గజగజ – జనంపైకి తిరగబడ్డ గజరాజు – దాడిలో ఒకరి మృతి – ప్రాణభీతితో పరుగులు తీసిన జనం జిల్లాలోని పడమటి పల్లెల్లో ఒంటరి ఏనుగు అలజడి సృష్టించింది. పెద్ద ఎత్తున ఘీకరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అడ్డొచ్చిన వారిని తరుముతూ హల్చల్ చేసింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రాణభీతితో పరుగులు తీశారు. పంటలు ధ్వంసమయ్యాయి. గజరాజు సరిహద్దుల్లోనే తిష్టవేసినట్టు స్థానికులు చెబుతున్నారు. రామసముద్రం : రామసముద్రం మండలాన్ని ఏనుగు వణికించింది. ఆదివారం ఉదయం నుంచి గజరాజు హల్చల్ చేయడంతో మండల ప్రజలు ఆందోళన చెందారు. పనులకు సైతం వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బేడపల్లె నుంచి వచ్చిన గజరాజు రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ ఎర్రçప్పల్లెకు చేరుకుంది. గమనించిన గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం అందించారు. పంట పొలాల వద్ద ఉండవద్దని హెచ్చరించారు. అక్కడి నుంచి ఏనుగును దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే అది చెట్లు, పుట్టలు, వరి, టమాట, మొక్కజొన్న, వేరుశనగ, రాగి పంటలను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో యువకులు, రైతులు, మహిళలు సైతం దాన్ని అరుపులతో వెంబడించారు. ఒక దశలో ఏనుగు జనంపైకి తిరగబడింది. దీంతో ప్రజలు ముళ్లలో పడుతూ లేస్తూ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. టి.రామప్ప(70) పరుగెత్త లేక కింద పడ్డాడు. ఏనుగు తన కాళ్లతో తొక్కి రామప్పను చంపివేసింది. ఏనుగు వచ్చిందన్న వార్త వినగానే చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు ఎటు నుంచి ఎటు వైపు వస్తుందో తెలియని ప్రజలు ఎక్కడ గ్రామాలపైకి వస్తుందోనని భయపడ్డారు. అటవీ సిబ్బంది, పోలీసులూ ఎం.గొల్లపల్లె నుంచి ఏనుగును కర్ణాటక రాష్ట్రం కారంగి అడవిలోకి దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుమారు రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన గజరాజు తిరిగి వెనక్కి వచ్చి ఎం.గొల్లపల్లె చెరువులో కొంత సేపు విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించింది. ప్రజలు దానికి ఎదురు వెళ్లవద్దని దూరంగా ఉండాలని పోలీసులు, అటవీ సిబ్బంది హెచ్చరిచారు. కొంతసేపు సేద తీరిన గజరాజు చెరువులో రెండు, మూడు సార్లు ప్రజలపై, అటవీ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అక్కడి నుంచి నరసాపురం, దిన్నిపల్లె, ఊలపాడు పొలాల మీదుగా దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. పొలాల్లో కూలీ పనులు చేసే కూలీలు సైతం భయపడి గ్రామాల్లోకి పరుగులు తీశారు. ద్విచక్రవాహనదారులను కూడా వెంబడించగా వారు పారిపోయారు. గజరాజు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో వేల సంఖ్యలో జనం చేరారు. గజరాజును వెంబడించే ప్రయత్నంలో ప్రజలకు స్వల్పగాయాలు, కాళ్లలో ముళ్లు గుచ్చుకుని అవస్థలు పడ్డారు. జనం తొక్కిసలాటలో ఓ కుందేలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంది. పంటపొలాలు కూడా ధ్వంసమయ్యాయి. పొలాల్లో మేతకు కట్టేసిన పశువులు సైతం ఏనుగును చూసి భయపడి తాళ్లు తెంచుకుని పరుగులు తీశాయి. సాయంత్రం గజరాజు రామసముద్రం సమీపంలోని సబ్స్టేషన్ వద్ద చింతచెట్ల తోపులోకి చేరుకుంది. రాత్రి పుంగనూరు నుంచి రామసముద్రం వైపు వాహన రాకపోకలు కూడా నిలిపివేశారు. కర్ణాటక నుంచి వచ్చింటున్న ప్రజలు మండల సరిహద్దుల్లోని కర్ణాటక కారంగి అడవి నుంచి గజరాజు దారి తప్పి వచ్చిందని మండల ప్రజలు అనుమానిస్తున్నారు. తిరిగి దానిని అక్కడికే పంపేయాలని అటవీ సిబ్బంది, పోలీసులు, ప్రజలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పంటలపై ఏనుగు దాడి పది రోజులుగా కారంగి అడవి నుంచి వచ్చిన గజరాజు సరిహద్దుల్లో ఉన్న కురిజల పంచాయతీ దొడ్డిపల్లె సమీపంలోని రైతుల పంట పొలాలను ధ్వంసం చేసింది. గ్రామానికి చెందిన చౌడప్ప టమాట పంటను రెండు రోజులుగా తొక్కి నష్టం చేసింది తెలిసిందే. గజరాజు వచ్చిందని తెలిసిన గ్రామస్తులు, కర్ణాటక అటవీశాఖ సిబ్బంది దాన్ని తిరిగి కారంగి అడవిలోకి తరిమివేశారు. అయితే సరిహద్దుల్లోని సంచరిస్తున్న గజరాజు దారి మళ్లించి మండలంలోకి ప్రవేశించింది. రామప్పకు రూ.5 లక్షల పరిహారం చిత్తూరు కలెక్టరేట్ : ఏనుగు దాడిలో మృతి చెందిన రామకుప్పం మండలం కురప్పపల్లెకు చెందిన రామప్పకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేయనున్నట్లు కలెక్టర్ సిద్ధార్థ్జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.