
శిక్షణ పొందిన ఏనుగులు వినాయక్, జయంత్‌లను అటవీ ప్రాంతంలోకి తీసుకెళుతున్న సిబ్బంది
– అడ్డకొండకు చేరిన గజరాజు
– ఫారెస్ట్ అధికారుల మోహరింపు
– హైదరాబాద్ నుంచి షూటర్లు, డాక్టర్లు
– ననియాల నుంచి శిక్షణ ఏనుగులు
రామసముద్రం/రామకుప్పం: రామసముద్రం మండలంలో రెండు రోజులుగా బీభత్సం సృష్టించి, ఓ వ్యక్తిని తొక్కి చంపిన గజరాజును బంధించేందుకు అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆదివారం రోజంతా హల్‌చల్‌చేసిన ఏనుగు రాత్రికి ఎర్రప్పపల్లె, కొత్తూరు, ఎం.గొల్లపల్లె, దిన్నెపల్లె, ఊలపాడు మీదుగా రామసముద్రం సమీపంలోని సబ్ స్టేషన్‌లోని చింతతోపులోకి చేరుకుంది. అక్కడ రాత్రంతా పోలీస్, అటవీశాఖ అధికారులు గస్తీ చేశారు. సోమవారం గజరాజు సమీపంలోని అడ్డకొండ అడవిలోకి చేరుకున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అదేవిధంగా కుప్పం, తిరుపతి, పలమనేరు ప్రాంతాల నుంచి పలువురు అటవీశాఖ అధికారులు రామసముద్రం మండలానికి చేరుకున్నారు. గజరాజు వెళ్లిన జాడలను గుర్తించేందుకు అడ్డకొండ అడవిలోకి సిబ్బంది చేరుకున్నారు. అక్కడ గజరాజును గుర్తించి కిందకు దారిమళ్లించే ప్రయత్నం చేశారు. గజరాజు ఎదురు దాడికి పాల్పడగా సిబ్బంది కింద ఉన్న ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి దాని అలికిడిని గుర్తిస్తూ పహారా నిర్వహించారు. కిందికి రప్పించడం తమతో సాధ్యం కాదని సిబ్బంది తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ననియాల ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి శిక్షణ పొందిన ఏనుగులు వినాయక్, జయంత్‌లను అడ్డకొండ ప్రాంతానికి తరలించారు. వాటి ఘీంకారంతో అడవిలో ఉన్న ఏనుగు బయటకు వస్తుందని భావిస్తున్నారు. బంధించేందుకు హైదరాబాద్ నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే షూటర్లు, వైద్యులు కూడా చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆపరేషన్ ప్రారంభం కావడంతో అటవీశాఖ, పోలీసు బలగాలను కొండచుట్టూ మొహరించారు. జనం సమీపానికి రాకుండా దూర ప్రాంతానికి తరిమేశారు. చీకటి కావస్తున్నా గజరాజు అడవి నుంచి బయటకు రాకపోవడంతో అటవీశాఖ సిబ్బంది టపాకాయలు పేల్చుతూ అరుపులు, కేకలతో దాన్ని కిందకు మళ్లించే యత్నంచేశారు. చీకటి పడే సమయానికి అడవిలో నుంచి వెనుదిరిగిన ఏనుగు టపాకాయల శబ్ధానికి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో చక్రపాణి, అటవీశాఖ సీఐ, ఎస్‌లు, చిత్తూరు, పుంగనూరు, కుప్పం, పలమనేరు ప్రాంతాల నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పుంగనూరు సీఐ రవింద్ర, ఎస్‌ఐ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఏనుగును పట్టుకునే దృశ్యాన్ని చూసేందుకు ఆ ప్రాంతానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.