సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి.
దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి.
ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment