vijaya dasami festival
-
విజయదశమిపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి. ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం. -
ఇంటింటా దసరా...
-
Dussehra: దసరా రోజున ఏం చేయాలి?!
ఒకప్పుడు లోకాలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే మాయావులైన చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులతో రోజుకో రూపంలో పోరాడి సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది ఆది పరాశక్తి. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దేవీ నవరాత్రులు... విజయ దశమి వేడుకలు. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా విజయ దశమి రోజునే. దసరా రోజునే శ్రీరామచంద్రుడు... దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ బల పరాక్రమాలు కలవారే, తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అమాయకులను పీడించడమే వారి పని. ఆయా రాక్షసులకు స్త్రీలంటే చిన్నచూపు. తమ జోలికి వారు రాలేరని, తమనేమీ చేయలేరన్న చులకన భావం. అందుకే పురుషుల చేతిలో ఓడిపోరాదన్న వరాలను పొందారు. అటువంటి లక్షణాలున్న వారిని అణిచి వేయకబోతే అందరి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి దేవి ముందుకు వచ్చింది. అందరి మొరలూ ఆలకించే అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. ఇంట్లో బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు అమ్మ వచ్చి దండిస్తుందేమోననే భయంతో ఉంటారు. ఆ సమయంలో అమ్మ మామూలుగా చూసినా, కోపంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే. ఆ శత్రువులపై మనమే పోరాటం చేయాలి. విజయం సాధించాలి. మామూలుగా దసరా... దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం... వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. విజయాలకు పునాది విజయదశమి అంటే సకల విజయాలనూ కలగ చేసే దశమి. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. ఈ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభించడం వల్ల నిరాటంకంగా జరుగుతాయని నమ్మకం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. దసరా రోజున ఏం చేయాలి? దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్య మంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఆయుధ పూజ, వాహన పూజ చేయడం, వృత్తిదారులు తమ పనిముట్లను పూజించడం వంటివి మహర్నవమితోపాటు ఈ రోజున కూడా కొందరు చేస్తారు. విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. ఆ శ్లోకంతోపాటు మన కోరికలేమైనా ఉంటే వాటిని చీటీ మీద రాసి జమ్మి కొమ్మకు కట్టాలి. జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అయిన తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. ఆడపడచులను ఆదరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, శక్తిమేరకు దానధర్మాలు చేయడం ఈ పండుగ విధులలో ఇతర ప్రధానమైన అంశాలు. సమష్టి బలం ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధం చేసి విజయం సాధించింది. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఒక్కరుగా చేయలేని పనిని ఐకమత్యంగా చేయవచ్చని. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ తెలియచేస్తోంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
దసరా కానుక.. ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి పెండింగ్ డీఏలను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి మొత్తం మూడు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. మూడు డీఏల మంజూరు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.3,802 కోట్లు భారం పడుతుంది. అలాగే బకాయిలను ఉద్యోగుల భవిష్య నిధి (జీపీఎఫ్)కు జమ చేయడానికి మరో రూ.9,504 కోట్లు వ్యయం కానుంది. దీనివల్ల 4,49,000 ఉద్యోగులకు, 3,57,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. – జూలై 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏను వచ్చే ఏడాది జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలను ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. – జనవరి 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ వచ్చే ఏడాది జూలై వేతనాలతో నగదు రూపంలో ఆగస్టు 1న ఇస్తారు. డీఏ బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. – జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ 2022 జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో జీపీఎఫ్‌కు జమ చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించిన సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సైతం గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మరో డీఏను ఒకేసారి మంజూరు చేస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. -
నిఘానేత్రాలను ఎత్తుకెళ్లారు
సోన్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు త క్కువ కాదని, విద్యార్థుల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. వీటి ద్వారానే నేరాలు అదుపు, విద్యార్థుల పర్యవేక్షణ సులువు కావడంతో అందరూ వాటినే ఏర్పాటు చేసుకుంటున్నారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంలు, గ్రామాభివృద్ధి కమిటీ రూ.20 వేల ఆర్థికసాయంతో సెప్టెంబర్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫర్నిచర్, ఫ్యాన్లు ధ్వంసం న్యూ వెల్మల్ బొప్పారం జెడ్పీ సెకండరీ పాఠశాలకు ఓ వైపు ప్రహరి ఉండి, మరోవైపు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు సెలవుదినాల్లో, రాత్రివేళ పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్, ఫ్యాన్లును గతంలో ధ్వంసం చేశారు. కిటికీలను పగలగొట్టారు. తరగతి గదుల్లో మద్యం సీసాలు, సిగరెట్లు దర్శనమిస్తున్నాయి. సెలవుల్లో ఎత్తుకెళ్లారు... రెండు గ్రామాల మధ్య ఉన్న ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు గ్రామాభివృద్ధి కమిటీ ఆర్థికసాయంతో సెప్టెంబర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌లో దసరా సెలవులు రావడంతో గు ర్తుతెలియని వ్యక్తులు మూడు కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు హెచ్ఎం మురళీధర్ తెలిపారు. దీనిపై సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
నేడు టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ
జిల్లాల పునర్విభజనపై సమీక్ష హన్మకొండ : దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటికే జిల్లాల వారీగా మండలాల విషయంలో కసరత్తు పూర్తి చేసింది. అలాగే, ప్రభుత్వ ఆదేశాలకు అధికారులు కార్యాలయాల ఎంపిక, సౌకర్యాల కల్పనలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఆఖరి అంకానికి చేరుకుంది. దసరా సమీపిస్తున్న క్రమంలో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఇదేరోజు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల నేతల సమావేశం జరగనుండగా.. మధాహ్నం 12 గంటలకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ బేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై జిల్లాలు, డివిజ¯ŒSలు, మండలాల ఏర్పాటు, చేర్పులు, మార్పులపై సీఎం చర్చిస్తారు. కాగా, వరంగల్, హన్మకొండ జిల్లాలపై కొంత మేర సందిగ్దత ఉన్న నేపథ్యంలో సోమవారం నాటి సమావేశం కీలకం కానుంది. జిల్లాల స్వరూపంపై పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సలహాలు, సూచనలు స్వీకరించి తుది రూపు ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు. -
కొత్త జిల్లాలు 13.. మండలాలు 74
-
కొత్త జిల్లాలు 13.. మండలాలు 74
► సిరిసిల్ల, నిర్మల్‌కు నో చాన్స్.. ► వచ్చే వారంలోనే నోటిఫికేషన్ ► సీఎం ఆమోదించటమే తరువాయి ► ప్రధాని పర్యటన తర్వాత కీలక సమావేశం ► నోటిఫికేషన్ తర్వాత 30 రోజులు అభ్యంతరాల స్వీకరణ ► విజయదశమి రోజునే కొత్త జిల్లాల ఆవిర్భావం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలపై వచ్చే వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఈ మేరకు రాష్ట్ర భూపరిపాలనా విభాగం కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన కొత్త జిల్లాల రోడ్ మ్యాప్ ప్రకారం ఆగస్టు 4 నుంచి 10వ తేదీ మధ్య జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఈ ముసాయిదా ప్రకటన జారీ అయిన తేదీ నుంచి నిర్ణీత గడువు (30 రోజులు) లోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు క్రోడీకరించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏకు అందజేస్తారు. వాటిని పరిష్కరించిన తర్వాత జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అక్టోబర్ 11 (విజయదశమి) నుంచి నూతన జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన చేపట్టేందుకు రెవెన్యూ, సీసీఎల్ఏ ఇప్పటికే అన్ని సన్నాహాలు చేసింది. అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాల్సిన అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన రేషనలైజేషన్ ప్రక్రియకు సీసీఎల్ఏ రేమండ్ పీటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవైపు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయటంతోపాటు మరోవైపు మౌలిక వసతులు, ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం 23 జిల్లాలు.. రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రతిపాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లాను ముసాయిదా నుంచి తొలగించింది. కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్ జిల్లా ఏర్పాటు అంశాన్ని సైతం పక్కకు పెట్టింది. దీంతో ప్రస్తుత మున్న పది జిల్లాలకు అదనంగా మంచిర్యాల (కొమురంభీం), జగిత్యాల, భూపాలపల్లి (ఆచార్య జయశంకర్), మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి(భువనగిరి), కొత్తగూడెం, సికింద్రాబాద్ కొత్త జిల్లాలుగా ఏర్పడుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా పునర్వవ్యస్థీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు వీలుగా మొత్తం 23 జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల జాబితాతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్తగా 74 మండలాలను ఏర్పాటు చేయనుంది. హరితహారం, ప్రధాని పర్యటనతో ఆలస్యం రుతుపవనాల రాకతో రాష్ట్రమంతటా వర్షాలు కురియడంతో ప్రభుత్వం జూలైలో హరితహారం కార్యక్రమం చేపట్టింది. దీంతో అప్పటివరకు కొత్త జిల్లాలపై వేగంగా జరిగిన కసరత్తుకు బ్రేక్ పడింది. మరోవైపు మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో ప్రభుత్వం బిజీ అయింది. ఈలోగా ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం సర్కారును చుట్టుముట్టింది. దీంతో సీఎం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించలేకపోయారు. అందుకు సంబంధించిన సమీక్షలను వాయిదా వేసుకున్నారు. సీఎం ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం జూలైలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. జూన్ 29న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలతో కొత్త జిల్లాలపై సీఎం సమావేశమయ్యారు. పార్టీ నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ఆ తర్వాత జూలై 5న జరగాల్సిన కలెక్టర్ల కాన్ఫరెన్స్, 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా పడ్డాయి. దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జాప్యమవుతుందనే సందేహాలు వెల్లువెత్తాయి. కానీ ముందుగా ప్రకటించిన మేరకే దసరా నాటికి కొత్త జిల్లాలు కొలువుదీరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపే అవకాశాలున్నాయి. సీఎం ఆమోదం పొందటమే తరువాయి.. ఏ క్షణంలోనైనా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల రెండో వారంలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆలస్యమైతే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ప్రకటన చేస్తారని చెబుతున్నాయి.