
కొత్త జిల్లాలు 13.. మండలాలు 74
► సిరిసిల్ల, నిర్మల్‌కు నో చాన్స్..
► వచ్చే వారంలోనే నోటిఫికేషన్
► సీఎం ఆమోదించటమే తరువాయి
► ప్రధాని పర్యటన తర్వాత కీలక సమావేశం
► నోటిఫికేషన్ తర్వాత 30 రోజులు అభ్యంతరాల స్వీకరణ
► విజయదశమి రోజునే కొత్త జిల్లాల ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలపై వచ్చే వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఈ మేరకు రాష్ట్ర భూపరిపాలనా విభాగం కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన కొత్త జిల్లాల రోడ్ మ్యాప్ ప్రకారం ఆగస్టు 4 నుంచి 10వ తేదీ మధ్య జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఈ ముసాయిదా ప్రకటన జారీ అయిన తేదీ నుంచి నిర్ణీత గడువు (30 రోజులు) లోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు క్రోడీకరించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏకు అందజేస్తారు. వాటిని పరిష్కరించిన తర్వాత జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అక్టోబర్ 11 (విజయదశమి) నుంచి నూతన జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన చేపట్టేందుకు రెవెన్యూ, సీసీఎల్‌ఏ ఇప్పటికే అన్ని సన్నాహాలు చేసింది. అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాల్సిన అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన రేషనలైజేషన్ ప్రక్రియకు సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవైపు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయటంతోపాటు మరోవైపు మౌలిక వసతులు, ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మొత్తం 23 జిల్లాలు..
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రతిపాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లాను ముసాయిదా నుంచి తొలగించింది. కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్ జిల్లా ఏర్పాటు అంశాన్ని సైతం పక్కకు పెట్టింది. దీంతో ప్రస్తుత మున్న పది జిల్లాలకు అదనంగా మంచిర్యాల (కొమురంభీం), జగిత్యాల, భూపాలపల్లి (ఆచార్య జయశంకర్), మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి(భువనగిరి), కొత్తగూడెం, సికింద్రాబాద్ కొత్త జిల్లాలుగా ఏర్పడుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా పునర్వవ్యస్థీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు వీలుగా మొత్తం 23 జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల జాబితాతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్తగా 74 మండలాలను ఏర్పాటు చేయనుంది.
హరితహారం, ప్రధాని పర్యటనతో ఆలస్యం
రుతుపవనాల రాకతో రాష్ట్రమంతటా వర్షాలు కురియడంతో ప్రభుత్వం జూలైలో హరితహారం కార్యక్రమం చేపట్టింది. దీంతో అప్పటివరకు కొత్త జిల్లాలపై వేగంగా జరిగిన కసరత్తుకు బ్రేక్ పడింది. మరోవైపు మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో ప్రభుత్వం బిజీ అయింది. ఈలోగా ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం సర్కారును చుట్టుముట్టింది. దీంతో సీఎం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించలేకపోయారు. అందుకు సంబంధించిన సమీక్షలను వాయిదా వేసుకున్నారు. సీఎం ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం జూలైలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. జూన్ 29న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కొత్త జిల్లాలపై సీఎం సమావేశమయ్యారు.
పార్టీ నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ఆ తర్వాత జూలై 5న జరగాల్సిన కలెక్టర్ల కాన్ఫరెన్స్, 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా పడ్డాయి. దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జాప్యమవుతుందనే సందేహాలు వెల్లువెత్తాయి. కానీ ముందుగా ప్రకటించిన మేరకే దసరా నాటికి కొత్త జిల్లాలు కొలువుదీరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపే అవకాశాలున్నాయి. సీఎం ఆమోదం పొందటమే తరువాయి.. ఏ క్షణంలోనైనా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల రెండో వారంలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆలస్యమైతే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ప్రకటన చేస్తారని చెబుతున్నాయి.